Renuka Chowdhury :  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. 2014 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించిన వైద్యుడు భూక్యా రామ్‌జీ నాయక్‌ భార్య భూక్యా కళావతి ఫిర్యాదుతో రేణుకా చౌదరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎమ్ఎస్ చౌదరి, రేణుకా చౌదరి ఏడుగురు అనుచరులపై ఐపీసీ సెక్షన్లు 420, 506, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని 3(1) సెక్షన్‌ల కింద కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. 


మాజీ ఎంపీ రేణుకా చౌదరి విమర్శలు  


ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ రేణుకా చౌదరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇద్దరు నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. రఘునాధపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో మంత్రి పువ్వాడపై రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అజయ్ కుమార్ ఖమ్మంలో కొండలు, గుట్టలు, చెరువులు దోచుకొని తింటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాత బస్టాండ్ అమ్మేసి కొత్త బస్టాండ్ కట్టారని అయితే వర్షం పడితే కొత్త బస్టాండ్‌లో ప్రయాణికులు ఉండలేని పరిస్థితి ఉందన్నారు. మంత్రి అవకతవకలు సోషల్ మీడియాలో పెడితే వారిని కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


పువ్వాడ అజయ్ కౌంటర్ 


కాంగ్రెస్ రచ్చబండలో రేణుకా చౌదరి కామెంట్స్ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. గిరిజన డాక్టర్‌కు టిక్కెట్ ఇప్పిస్తానని రూ. కోటి తీసుకున్నది ఎవరో ఖమ్మం ప్రజలకు తెలుసన్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత రేణుకా చౌదరికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయంలో కనిపించరని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాకు ఏడాదికి ఒక్కసారి సైబీరియన్ కొంగలు వచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు అయిదు సంవత్సరాలకు ఒకసారి వస్తారని చురకలు అంటించారు. ఎలక్షన్ కు హడావుడి చేసి ఎలక్షన్ తర్వాత మాయమయ్యే నాయకులను నమ్మొద్దని ప్రజలకు హితవు పలికారు. తన స్పీడ్‌కు బ్రేక్స్ వేయడం ఎవరితరం కాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.


Also Read : Revanth Reddy: ఇక్కడ ఫాంహౌస్ దాటరు! అటు వెళ్లి నష్ట పరిహారమా? రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న


Also Read : Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!