ప్రేమలో మునిగిపోయారా? మరి ఆ వ్యక్తి ప్రేమ నిజమైనదో కాదో మీకు తెలిసేదెలా? ఈ ప్రశ్న అడిగితే చాలా మంది చెప్పే సమాధానం ‘నమ్మకం ఉండాలండి’ అని. ప్రేమలో నమ్మకం అవసరమే, అలాగే జాగ్రత్త తీసుకోవడం, ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో అంచనా వేయడం కూడా అత్యవసరం. ప్రేమ మైకంలో మోసపోయిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అలా మోసపోకుండా మిమ్మల్ని ప్రేమిస్తున్న అని చెప్పిన వ్యక్తి నిజాయితీ ఎంత ఉందో? ఆ ప్రేమను పెళ్లి పీటల దాకా చేర్చే సిన్సియారిటీ ఉందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం. వారి చేతలు, మాట్లాడే మాటల ద్వారా మీకు ఆ విషయాన్ని గ్రహించవచ్చు. మీతో భవిష్యత్తును, జీవితాన్ని పంచుకోవాలనుకునే వ్యక్తి మాటలు ఎలా ఉంటాయంటే...
భవిష్యత్తులో మీపేరు
కొన్నాళ్లు మీతో ప్రేమ నాటకం ఆడాలనుకున్న వ్యక్తి తన భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. అతని భవిష్యత్ జీవితంలో మీ గురించి ఏదీ మాట్లాడలేదంటే కాస్త అనుమానించాల్సిందే. ఆయన భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో లేదా కోరుకుంటుందో అడగండి. పదే పదే అదే విషయాలను మాట్లాడించండి. అతను లేదా ఆమె మాట్లాడిన మాటల్లో మీకు సముచిత స్థానం ఇవ్వకపోవడం, మీతో కలిపి అతని భవిష్యత్తు ప్లానింగ్ లేకపోవడం వంటి అంశాలు మీకు అనిపిస్తే అతను లేదా ఆమె ప్రేమను మీరు శంకించాల్సిందే. మనం అనే పదం అతను ఎన్ని సార్లు వాడుతున్నాడో కూడా గమనించండి.
మీకిచ్చే విలువను బట్టే...
మీరు ప్రేమలో నిజాయితీగా ఉన్నప్పుడు అవతలి వ్యక్తి ఎలా ఉన్నాడో కూడా గమనించండి. పదేపదే మీరే ఫోన్ చేయడం, మీరే వీకెండ్ ప్లాన్ చేయడం వంటివి చేయకండి. అతను మీ విషయంలో ఎంతగా రెస్పాండ్ అవుతున్నాడో గమనించండి. మీరు ప్లాన్ చేయడం, ఫోన్ చేయడం ఆపేశాక అతను వాటికి ఎంత విలువిస్తున్నాడో గమనించండి. మీ బదులు అతనే పదే పదే ఫోన్ చేయడం, వీకెండ్ ప్లాన్ చేయడం వంటి బాధ్యతలు తీసుకుంటే ఫరవాలేదు, అలా కాకుండా అతను అంత ఆసక్తి చూపించకపోతే ఆ ప్రేమ టైమ్ పాస్‌దేమో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డబ్బులు ఖర్చు పెట్టే విషయం దగ్గర అసలైన ప్రేమ బయటపడుతుంది.
సమయం దొరికితే మీతోనే...
గంట సమయం చిక్కినా మీతోనే మాట్లాడాలని, మీతోనే ఉండాలని మీ లవర్ భావిస్తుంటే మీకు ఆ విషయం అర్థమైపోతుంది. తనకు సంబంధించిన ప్రతి అంశంలో మిమ్మల్ని కలుపుకుని వెళ్లే వ్యక్తి కచ్చితంగా మీ రిలేషన్ ను సీరియస్ గా తీసుకుంటున్నాడని అర్థం.
సర్కిల్ లో కలిపేసుకుంటే...
ప్రతి వ్యక్తి తన సొంత ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది. అలాగే కుటుంబం ఉంటుంది. మీ ప్రేమను పెళ్లి పీటలెక్కించాలని నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొదట తన క్లోజ్ ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాడు. ఆ సర్కిల్ లో మిమ్మల్ని కలిపేస్తాడు. తరువాత బంధువులకు, ఇంట్లో వారికి కూడా పరిచయం చేస్తాడు. కనీసం తనకు తెలిసిన వారెవ్వరికీ మిమ్మల్ని పరిచయం చేయకుండా ఉన్నాడంటే అతని ప్రేమ నిజమో కాదో తెలుసుకోవాల్సిందే.
Also read: ఈ పండు రసంతో అదుపులో అధిక రక్తపోటు, రోజూ తాగితే ఎంతో మేలు
Also read: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు