MP Raghurama Krishn Raju :  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ పై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సోమవారం విచారణ చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నాడని వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ గతంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. భరత్ పిటిషన్‌పై విచారణ జరిపిన స్పీకర్ ఓం బిర్లా, ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సునీల్ కుమార్ సింగ్ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు. మౌఖిక సాక్ష్యం ఇచ్చేందుకు ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ ఇవాళ హాజరయ్యారు. 


లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు 


పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌ను వైసీపీ ఎంపీలు కోరారు. ఈ విషయంలో స్పీకర్ పక్షపాతం పాటిస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి గతంలో ఆరోపించారు. ఏడాది నుంచి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడంలేదని, చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో నిరసన చేస్తామని విజయ సాయి రెడ్డి తీవ్రంగానే స్పందించారు. 


ప్రివిలేజ్ కమిటీ విచారణ 


ఈ విమర్శలపై అప్పట్లో స్పందించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా  పిటిషన్‌పై నిర్ణయం తీసుకోడానికి ఒక ప్రక్రియ ఉంటుందన్నారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చించాల్సి ఉందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాతే సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిశీలన అనంతరం సభాహక్కుల కమిటీకి పంపుతామని అప్పట్లో చెప్పారు. అయితే పార్లమెంట్ లో ఎవరికైనా నిరసన తెలిపే హక్కుందని వ్యాఖ్యానించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై రన్నింగ్ కామెంటరీ చేయలేమని స్పీకర్ ఘాటుగా బదులిచ్చారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ పై నివేదిక ఇవ్వాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా గతంలో ఆదేశించారు. పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ లోక్ సభ విప్ మార్గాని భరత్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్పీకర్ చర్యలకు ఆదేశించారు. ఆ పిటిషన్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపించారు స్పీకర్. ప్రాథమిక విచారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా స్పీకర్ ఆదేశించారని లోక్ సభ సచివాలయం గతంలో పేర్కొంది. 


Also Read : Lokesh On Ysrcp Govt : తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!