Karnataka Crime News: ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు, గట్టిగా మందలించాలనుకున్నప్పుడు.. ‘చర్మం ఒలిచేస్తా’ అని గద్దిస్తాం. మామూలుగా శరీరంలో దెబ్బ తగిలి చర్మం లేచిపోతే నొప్పితో విలవిలలాడిపోతాం. అదే ఒక మనిషిని చంపి చర్మం ఒలిస్తే? ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. భోజనం వడ్డించలేదని ఓ వ్యక్తి ఆగ్రహించి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలు చేసి చర్మం ఒలిచాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. గురువారం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 


భోజనం వడ్డించలేదని
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుణిగల్ తాలూకాలోని హులియూరుదుర్గ పట్టణంలో సోమవారం రాత్రి దారుణం జరిగింది. శివరామ, పుష్పలత భార్యభర్తలు. వీరు పదేళ్ల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. శివరాం కోత మిషన్‌లో పని చేస్తున్నాడు. కొద్ది కాలంగా శివరాం, పుష్పలత మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అదే రోజు రాత్రి పుష్పలత భర్త శివరాంకు భోజనం వడ్డించలేదు. దీంతో భార్య భర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 


తల నరికి, పేగులు బయటకు తీసి
ఈ క్రమంలో ఆగ్రహించిన శివరాం భార్య పుష్పలతను కత్తితో పొడిచి హతమార్చాడు. కొడవలితో ఆమె తలపై నరికి శరీర భాగాలను ఛిద్రం చేశాడు. అంతటితో ఆ కోపం చల్లారలేదు. మంగళవారం తెల్లవారుజాము వరకు భార్య మృతదేహానికి చర్మం ఒలిచాడు. శరీరం నుంచి పేగులు బయటకు తీశాడు. మెడను కోసి తలను వేరు చేశాడు. ఆ తరువాత తాను పని చేస్తున్న చోటుకు వెళ్లి యజమానికి తాను చేసిన పనిని చెప్పాడు. స్పందించిన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. 


కుటుంబ కలహాలతోనే హత్య
పుష్పలత హత్యకు సంబంధించిన వివరాలను తుమకూరు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ వెంకట్ వెల్లడించారు. ఘటనా స్థలంలో మహిళ మృతదేహం స్వాధీనం చేసుకున్నామని, ఆమె భర్త శివరాంను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. విచారణలో నిందితుడు హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకుని భద్రపరిచినట్లు చెప్పారు. శివరాం, పుష్ప 10 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారని, కుటుంబ గొడవల కారణంగా హత్య జరిగిందని తెలిపారు. కోత మిల్లు యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లినట్లు చెప్పారు. హత్య జరిగిన సమయంలో దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు నిద్రలో ఉన్నట్లు తెలిపారు.