AP CEO Warning To Political Party Candidates And Counting Agents: జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా అలజడి సృష్టిస్తే వారిని వెంటనే అరెస్ట్ చేస్తామని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ సాగేలా చూడాలన్నారు. మచిలీపట్నంలోని (Machilipatnam) కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని.. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని.. కౌటింగ్ కేంద్రాల్లోకి ఫోన్లు అనుమతించమని తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ దళాలు సైతం భద్రతను పర్యవేక్షిస్తాయని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జిల్లాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఫలితాల తర్వాత అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.
పోస్టల్ బ్యాలెట్స్‌పై సీఈసీ స్పష్టత
మరోవైపు, పోస్టల్ బ్యాలెట్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. తాజా మార్గదర్శకాలపై వైసీపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో వాటిని తోసిపుచ్చుతూ.. కీలక ఆదేశాలిచ్చింది. డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లను వాలీడ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఈవోకు లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు.
అంతకు ముందు సీఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. 'ఫామ్ 13ఏ'పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. అలా ఉండి స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటవుతుంది. ఆర్వో సంతకంతో పాటు బ్యాలెట్ ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలి. ఫామ్ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు. అలాగే, పోస్టల్ బ్యాలెట్ పేపర్‌పై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా, ఆ ఓటు తిరస్కరించవచ్చు.' అని ఎన్నికల సంఘం పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించాల్సిన పరిస్థితే వస్తే.. లోపలి కవర్ తెరవకుండా తిరస్కరించాలని అది కూడా ఫారం-13ఏలోని డిక్లరేషన్, ఫారం-13సీ లోని కవర్ బీ లోపల కనిపించని పక్షంలో తిరస్కరించవచ్చంటూ సూచించింది. అటు, డిక్లరేషన్ పై ఓటర్లు సంతకం చేయకపోయినా ఆ బ్యాలెట్ ను తిరస్కరించొచ్చని స్పష్టం చేసింది. దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరం తెలపగా.. తాజాగా మరోసారి సీఈసీ స్పష్టత ఇచ్చింది. అయితే, సీఈసీ ఆదేశాలపైన వైసీపీ నేతలు హైకోర్టులలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: Devineni Uma On Sajjala : కోడ్ ఉల్లంఘిస్తున్న సజ్జలను వెంటనే అరెస్టు చేయాలి - టీడీపీ డిమాండ్