Diamonds Hunting in Kurnool: తొలకరి చినుకుల కోసం రైతు ఎదురుచూపులు చూసాం కానీ.. ఆ ప్రాంతంలో మాత్రం తొలకరి చినుకుల కోసం ఆకాశం వైపు ఆశగా వజ్రాల వేటగాళ్లు ఎదురుచూస్తారు.  రాయలు ఏలిన రతనాల సీమలో నేలను చినుకు ముద్దాడితే చాలు నేల తల్లి కడుపులో వజ్రాలు పుడుతున్నాయి. వేలమంది తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సీమ నేలపై అడుగుపెడతారు. ఏంటి వర్షం పడితే పంటలు పండుతాయి కానీ వజ్రాలు ఎలా పండుతాయి అనుకుంటున్నారా అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. 


 పౌరుషాల పురిటి గడ్డ  రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా, దాని పక్కనే ఉన్న అనంతపురం జిల్లాల్లో జనం వజ్రాల అన్వేషణలో మునిగి తేలుతున్నారు.  ఏటా వర్షాకాలంలో కర్నూలు జిల్లా జొన్నగిరి, అనంతపురం జిల్లా వజ్రకరూరు తదితర ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాలు లభిస్తుండడంతో చుట్టుపక్కల జిల్లాలు, రాష్ర్ర్టాల నుండి అనేక మంది  తరలివచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. వజ్రాలు దొరికిన వారు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుని రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులవుతున్నారు. 


 కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి, మద్దికెర మండలాల పరిధిలోని జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి  గ్రామాలతోపాటు, అనంతపురం జిల్లా పరిధిలోని వజ్రకరూరు మరికొన్ని గ్రామాల పరిధిలో  వజ్రాలు లభిస్తాయి. వర్షాలు కురిస్తే చాలు భూ పొరల్లో వజ్రాలు మెరుపులకు భూమిపై తేలుతుంటాయి. ముఖ్యంగా ఈ ప్రాంతమంతా ఎర్రమట్టి రాళ్ల నేలలే. వర్షాల సమయంలో మెరుపులకు రాళ్లలో నిక్షిప్తమైన వజ్రాలు రాతి పొరల నుండి బయటపడుతున్నట్లు స్థానికులు చెబుతారు.  


వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే మే నెల నుండి వర్షాకాలం ముగిసే వరకు ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతుంది.  వజ్రాల అన్వేషణ కోసం వచ్చే వారంతా కూడా తమ జీవితంలో ఉన్న అనేక ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు ఎక్కువగా వజ్రాల వేట కోసం వస్తూ ఉంటారు.  సంచార్ల  తరహాలో వండుకోవడానికి కొన్ని పాత్రలు తెచ్చుకుని.. సమీప గ్రామాల్లోని గుళ్లు, బళ్లలో నివాసం ఉంటూ నెలల తరబడి వజ్రాలను వెతుకుతూ ఉంటారు. తెచ్చుకున్న డబ్బు అయిపోతే గ్రామ సమీపంలోని సత్రాలలో తింటూ అది లేకపోతే అడుక్కోవడానికి కూడా వెనుకాడరని తెలుస్తోంది. ముఖ్యంగా సరదా కోసం వజ్రాల అన్వేషణకు వచ్చేవారు కొందరైతే ఆర్ధికంగా చితికిపోయిన వారు ఎక్కువగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తూ ఉంటారు.


కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో దొరికే వజ్రాల విలువ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక క్యారెట్ వజ్రం దొరికితే సుమారుగా ఐదు నుంచి పది లక్షల వరకు మార్కెట్ విలువ చేస్తుంది. ఇప్పటివరకు సుమారుగా లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల విలువైన వజ్రాలు కూడా ఈ ప్రాంతాల్లో లభ్యం అవుతుండడం విశేషం. 


 పంట పొలాల్లో దొరికే రంగు రాళ్లు, వజ్రాల గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. రంగు రాళ్లు, వజ్రాలతోపాటు బంగారం నిక్షేపాలు కూడా అపారంగా ఉన్నట్లు తేలింది. బంగారు నిక్షేపాలు ఎంత మేరకు ఉన్నాయో నిర్ధారించేందుకు గత 15 ఏళ్లుగా సర్వే జరుగుతోంది. జొన్నగిరి పక్కనే గోల్డ్ మైనింగ్ కూడా జరగటం విశేషం. 


రాయలు ఏలిన రాయలసీమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వేల సంఖ్యలో జొన్నగిరి, ఎర్రగుడి తుగ్గలి మండలంలోని వివిధ గ్రామాల్లో అలాగే అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం వజ్రకరూరు చుట్టుపక్కల గ్రామాల్లో వజ్రాల వేటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్వేషిస్తూ ఉంటారు వజ్రం దొరికిన వాళ్లు ఆనందంతో తమ సమస్యలు తీరిపోయాయి అనుకొని వెళ్లే వాళ్ళు కొందరు అయితే.. మరో పక్క తమకు కూడా ఒక్క వజ్రం అయినా దొరకపోదా.. తమ కష్టాలు తిరిపోవా.. అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పిల్ల పాపలతో పంట పొలాల్లో అన్వేషించేవారు మరికొంతమంది.