Karnataka Official Murdered: 


ఇంట్లోనే హత్య..


కర్ణాటకలో ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లోనే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 4వ తేదీన రాత్రి ఈ ఘటన జరిగింది. మృతురాలి పేరు ప్రతిమ. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యుటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. సుబ్రహ్మణ్యపురలోని ఇంట్లో ఆమె రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు పోలీసులు. కత్తితో పొడిచి ఆమెని హత్య చేసినట్టు తెలిపారు. పని పూర్తైన తరవాత కార్‌ డ్రైవర్‌ ఆమెని ఇంట్లో దిగబెట్టారు. దాదాపు 8 ఏళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నారు ప్రతిమ. ఆ తరవాత కాసేపటికే 8.30 గంటల ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఆ సమయంలో భర్త, కొడుకు వేరే చోటకు వెళ్లారు. ఆదివారం (అక్టోబర్ 5) ఉదయం ప్రతిమ సోదరుడు ఆమె ఇంటికి వెళ్లాడు. రక్తపు మడుగులో ఆమెని చూసి షాక్ అయ్యాడు. అంతకు ముందు రాత్రి చాలా సార్లు కాల్ చేసినా అటెండ్ చేయలేదు. అనుమానంతో ఉదయమే ఇంటికి వచ్చి చూశాడు. ఇంట్లో ఆమె మృతదేహాన్ని చూసిన వెంటనే పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించాడు. 


"ఎప్పటిలాగే ఆఫీస్ పని పూర్తయ్యాక రాత్రి 8 గంటలకు ప్రతిమ ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి నుంచి ఆమెకి సోదరుడు చాలా సార్లు కాల్ చేశాడు. కానీ అటెండ్ చేయలేదు. అనుమానం వచ్చి ఉదమయే ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె హత్యకు గురవ్వడాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే మాకు సమాచారం అందించాడు. ఫోరెన్సిక్‌ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. విచారణ కోసం ప్రత్యేకంగా మూడు టీమ్స్‌ని ఏర్పాటు చేశాం. ఆ రాత్రి ఏం జరిగిందో ఇంకా కచ్చితంగా తెలియలేదు. దీనిపై స్పష్టత వచ్చాక మిగతా వివరాలు వెల్లడిస్తాం"


- పోలీసులు


స్పందించిన సీఎం..


ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన వాళ్లకు కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. 


"నాకు ఇప్పుడే ఈ ఘటన గురించి తెలిసింది. కచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హత్య జరిగింది. హత్యకు కారణమేంటో ఇంకా తెలియలేదు. విచారణ జరిపి తెలుసుకుంటాం"


- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి