దేశంలో 145 కోట్ల మంది జనాభా ఉంటే దేశమంతా ప్రభుత్వ ఉద్యోగాలు సుమారు 59 లక్షలు మాత్రమే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలాంటప్పుడు ఈ 59 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ వచ్చే పరిస్థితి ఉండబోదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 8 నుంచి 10 లక్షల వరకూ ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయని, దాంట్లో కూడా ఎక్కడ ఎవరు రిటైర్ అవుతుంటే దాని ప్రకారం నింపుతూ ఉంటారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే యువత ఎక్కువగా ఉంటుందని అన్నారు. మై విలేజ్ షో టీమ్‌తో చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేటీఆర్ ఈ విషయాలను చెప్పారు.


ఇలా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేం కాబట్టి, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంటుందని చెప్పారు. ‘‘ఉదాహరణకు ఫాక్స్ కాన్ అనే పరిశ్రమ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో పెట్టారు. వచ్చే ఏప్రిల్ లేదా మే కల్లా కార్యకలాపాలు మొదలవుతాయి. ఆ ఒక్క పరిశ్రమ వల్లే లక్ష ఉద్యోగాలు యువతకు వస్తాయి. ఇలా ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు నెలకొల్పేలా చేయకపోతే అన్ని ఉద్యోగాలు రావు. మన యువత దుబాయ్, ముంబాయి లాంటి చోట్లకి వలస పోవాల్సి వస్తది. 


అందుకని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించినది.. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపడంతో పాటు ప్రైవేటు రంగంలో కూడా పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమలు నెలకొల్పించి ఉపాధి కల్పించాలి. ఎంత వీలైతే అంత పెట్టుబడులను ఆకర్షించాలి. 


తెలంగాణలో వివిధ రకాల పంటలు పండుతాయి కాబట్టి, చెరకు, పసుపు, సోయా, మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెడుతున్నాం. వీటి వల్ల అటు రైతులకు మద్దతు ధరతో పాటుగా యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు 16 చోట్ల 10 వేల ఎకరాల్లో పెడుతున్నాం. గతంలో తెలంగాణలో వరి 68 లక్షల టన్నుల వరి పంట పండితే, ఇప్పుడు మూడున్నర కోట్ల టన్నులకు పెరిగింది. 


కౌలు రైతులకు అందుకే రైతు బంధఉ ఇవ్వట్లేదు - కేటీఆర్
కౌలు రైతులకు మన దగ్గర చట్టం ఉంది. సాధారణంగా కౌలు రైతుకు భూయజమానికి మధ్య ఒప్పందం అది. అది ఏడాదికో, రెండేళ్లకో మారొచ్చు. ఎక్కువ కాలం ఒకే రైతు చేస్తే భూ యాజమాన్య హక్కు వస్తుంది. ఆ పంచాయతీలో మనం పడితే గవర్నమెంట్ కి ఆ లెక్కలు మేనేజ్ చేయడానికే టైం సరిపోతుంది. అసలు భూయజమానికి రైతు బంధు ఇస్తే వారి ఒప్పందం ప్రకారం కౌలు రైతుకు ఇచ్చుకుంటాడనే నమ్మకంతో మనం కౌలు రైతుల జోలికి వెళ్లలేదు’’ అని కేటీఆర్ వివరించారు.






సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రముఖ యూట్యూబర్లు ‘మై విలేజ్ షో’ బృందంతో కలిసి వంట చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలను కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మై విలేజ్ షో యూట్యూబ్‌ ఛానెల్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పల్లెటూరి రుచులను, అనుబంధాల మీద వీడియోలు చేసి ఎంటర్‌టైన్ చేస్తుంటారు.చిన్న చిన్న వీడియోలతో ప్రారంభమైన ఈ ఛానల్‌ప్రస్తుతం సినిమా హీరోలతో ప్రమోషన్ వీడియోలు చేసే రేంజ్‌కు ఎదిగింది. ఇందులో గంగవ్వ బాగా ఫేమస్ కాగా, అనిల్, అంజి కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు.