జనగామ జిల్లాలోని ఓ యువతి ఓటుపై జనాల్లో చైతన్యాన్ని కలిగిస్తోంది. తన ఇంటి గేటుకు ఇచ్చట ఓట్లు అమ్మబడవని బోర్డు తగిలించింది. మందు, డబ్బు ఇవ్వనిదే ఓటు వేయబోననే ఈ రోజుల్లో వాణి అనే యువతి నుంచి వచ్చిన ఈ ఆలోచన అందరిని ఆలోచింపచేస్తుంది.
ఈ యువతి పేరు జంజాల వాణి. జనగామ జిల్లా ఎల్లంల గ్రామం. న్యాయ విద్య చదువుతున్న వాణి ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కుపై చైతన్య పరుస్తుంది. ఎన్నికల సమయం కావడంతో నేతలు ఓటర్ల తలుపు తట్టి డబ్బు, మద్యం తో ప్రలోభాలకు గురిచేస్తారు. నేతల ప్రలోభాలతో ఓటర్లు, ప్రజలు తమ భవిష్యత్ తోపాటు అభివృద్ధికి అడ్డుకట్ట వేసుకుంటున్నారనే ఆలోచనతో వాణి తన ఇంటి గేటుకు ఇచ్చట ఓట్లు అమ్మబడవు అని బోర్డు తగిలించింది. డబ్బులతో ఇంటికి వచ్చే నాయకులకు నేను డబ్బులు తీసుకొని ఓటు వేయమని చెబితే, ఆ చెప్పిన వారికి ఓటు వేయకుండా ఇతర పార్టీకి ఓటు వేస్తారనే అనుమానం వస్తుందని ఇలా బోర్డు పెట్టానని వాణి చెప్పింది. బోర్డు తగిలించిన రోజు అందరూ వింతగా అనుకున్నారని, తర్వాత అందరిలో ఆలోచన మొదలైందని వాణి చెప్పారు.
అయితే వాణి ఆలోచన మొదట్లో సాధ్యమా అనుకున్న వారు ఒక్కొక్కరిలో ఆలోచన బలపడుతుంది. వాణికి వచ్చిన ఆలోచన గొప్ప విషయమని మార్పు అనేది ఒక్కరితోనే స్టార్ట్ అవుతుందని గ్రామానికి చెందిన యువకులు చెబుతున్నారు. ప్రతి గ్రామంలో యువతలో ఇలాంటి ఆలోచన రావాలని అప్పుడే వ్యవస్థ మారి దేశం అభివృద్ధి చెందుతుందని కృష్ణ అనే యువకుడు అన్నారు. వాణి ఆలోచనను ఎల్లంల గ్రామ సర్పంచ్ కూడా స్వాగతించారు. డబ్బు మద్యం తీసుకోకుండా ఓటు వేసినప్పుడే ప్రజా ప్రతినిధిని సమస్యలపై అభివృద్ధిపై అడిగే హక్కు ఉంటుందని సర్పంచ్ సుజాత చెప్పారు.