కరీంనగర్ పట్టణంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. ఈ ఘటనపై సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ....కరీంనగర్ కమాన్ సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మైనర్ల నిర్వాకమేనన్నారు. కారు డ్రైవ్ చేసింది మైనర్ అని అతనితో పాటు మరో ఇద్దరు మైనర్లు కూడా ప్రమాద సమయంలో కారులో ఉన్నారన్నారు. అయితే కారు యజమాని కచ్చకాయల రాజేంద్రప్రసాద్ కుమారుడు ప్రధాన నిందితుడు అన్నారు. ఇతడు ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడన్నారు. మరో ఇద్దరు మైనర్లు పదో తరగతి చదువుతున్నారని తెలిపారు.
ప్రమాదంలో నలుగురు మృతి
ఆదివారం ఉదయం వ్యవసాయ ఆధార పనిముట్లు తయారు చేస్తున్న వీధి వ్యాపారులపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు మహిళలు మృతి చెందారని సీపీ సత్యనారాయణ తెలిపారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన బాలుడి తండ్రి రాజేంద్రప్రసాద్ తనే డ్రైవ్ చేసినట్టు నమ్మబలికే ప్రయత్నం చేశాడని కానీ పోలీసులు విచారణలో బాలుడే కారు నడిపినట్లు తేలిందన్నారు. లైసెన్స్ లేకున్నా, నడిపే అర్హత లేకున్నా కారు కుమారుడి ఇచ్చిన రాజేంద్రప్రసాద్ తో బాటు మైనర్ పై కేసులు నమోదు చేశామని తెలిపారు.
తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి
కారు ప్రమాదానికి కారణంగా దట్టమైన పొగ మంచు అని కారులో ఉన్న మైనర్లు తెలిపారని, బ్రేక్ కు బదులుగా యాక్సిలేటర్ తొక్కడంతో ప్రమాదం జరిగిందని సీపీ తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ 304 సెక్షన్ కింద కేసులు పెట్టామని, తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు వాహనాలను ఇచ్చి ఇలాంటి ప్రమాదాలకు కారణం కావద్దని సూచించారు. దీనివల్ల వారి జీవితాలను చేజేతులా నాశనం చేసిన వారు అవుతున్నారన్నారు. ప్రమాదానికి ముందు కమాన్ దగ్గర పెట్రోల్ బంకులో డీజిల్ నింపుకున్నారని సీసీటీవీ ఫుటేజ్ లో ఈ విషయం రికార్డు అయిందని అన్నారు.
అసలేం జరిగిందంటే...
కరీంనగర్ కమాన్ చౌరస్తాలో తెల్లవారుజామున ఓ కారు సృష్టించిన బీభత్సంలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. సీస కమ్మరి వృత్తి ద్వారా కత్తులు, గొడ్డళ్ళు తయారు చేసి విక్రయించుకునే వారిపై నుంచి కారు దూసుకెళ్లడంతో సంఘటన స్థలంలో ఒక మహిళ చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు. చనిపోయిన వారంతా నిరుపేద కుటుంబీకులు. ఈ రోజు ఆదివారం కావడంతో ఉదయం పూట కమాన్ చౌరస్తా లో తయారుచేసిన వస్తువులు అమ్ముకుంటారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన కూర్చున్న వారి పైకి కారు వేగంగా దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన కారు ఒక మహిళను ఢీ కొట్టి.. అనంతరం స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో కారుకు, స్తంభానికి మధ్య ఇరుక్కుపోయిన మహిళ అక్కడికక్కడే స్పాట్‌లోనే చనిపోయింది. దాదాపు ఈ ఘటనలో 9 మందికి గాయాలు కాగా వీరిలో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ఆసుపత్రిలో చనిపోయారు. కారు నడుపుతున్న వ్యక్తితో పాటు కారులో ఉన్న వాళ్ళు పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Also Read: కరీంనగర్‌లో ఘోర ప్రమాదం.. కారు, స్తంభం మధ్యలో పడి మహిళ మృతి.. మరో ముగ్గురు కూడా..