కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కమాన్ చౌరస్తా నుండి హైదరాబాద్ వెళ్లే దారిలో కల్వర్టు వద్ద గల సీస కమ్మరి పని చేసుకునే వారి పైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మహిళలు మృతి చెందారు. TS02 EY 2121 నంబర్ గల హ్యుండాయ్ క్రెటా కారు వారిపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కరీంనగర్ కమాన్ చౌరస్తాలో తెల్లవారుజామున ఓ కారు సృష్టించిన బీభత్సంలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. సీస కమ్మరి వృత్తి ద్వారా కత్తులు, గొడ్డళ్ళు తయారు చేసి విక్రయించుకునే వారిపై నుంచి కారు దూసుకెళ్లడంతో సంఘటన స్థలంలో ఒక మహిళ చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు. చనిపోయిన వారంతా నిరుపేద కుటుంబీకులు. ఈ రోజు ఆదివారం కావడంతో ఉదయం పూట కమాన్ చౌరస్తా లో తయారుచేసిన వస్తువులు అమ్ముకుంటారు.
ఈ క్రమంలోనే రోడ్డు పక్కన కూర్చున్న వారి పైకి కారు వేగంగా దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన కారు ఒక మహిళను ఢీ కొట్టి.. అనంతరం స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో కారుకు, స్తంభానికి మధ్య ఇరుక్కుపోయిన మహిళ అక్కడికక్కడే స్పాట్‌లోనే చనిపోయింది. దాదాపు ఈ ఘటనలో 9 మందికి గాయాలు కాగా వీరిలో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ఆసుపత్రిలో చనిపోయారు. కారు నడుపుతున్న వ్యక్తితో పాటు కారులో ఉన్న వాళ్ళు పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రక్తం మరకలతో సంఘటన స్థలం భీతావహంగా మారగా.. ఆస్పత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.
అతి వేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్‌లో ఇలా యాక్సిడెంట్ చేసిన కారుపై 9 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన చోటుచేసుకున్న తరువాత అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారయ్యారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. వారు మద్యం తాగి వాహనం నడిపారా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read: KCR Family: ముఖ్యమంత్రి ఫ్యామిలీలో విషాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
Also Read: Sangareddy: సంగారెడ్డిలో టీఆర్ఎస్ లీడర్ దారుణ హత్య.. తల, మొండెం వేర్వేరు చోట్ల.. కారణం ఏంటంటే..