ఏపీలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయని తెలిపారు. వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ సాధారణంగా కంటే మరింత తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాలు సహా.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాగల మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ప్రస్తుతం తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలుల ప్రభావంతో రాష్ట్రమంతా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం పొడిగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ వివరాలపై ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ కూడా కీలక అంచనాలను వెల్లడించారు. శీతల గాలుల ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చలి అధికంగా ఉంటుందని చెప్పారు. ‘‘విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత తీవ్రంగా ఉంటుంది. ఈ చలి తెల్లవారిజామున సమయంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోకి విస్తరిస్తుంది కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరో వైపున విశాఖ నగరంలో సాధారణంగానే చలి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రం మొత్తం చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. వాటి ప్రభావం వల్ల గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో తెలంగాణకి ఎంత దగ్గరగా మీ ప్రదేశం ఉంటుందో అంత చల్లగా ఉంటుంది. అనంతపురం, చిత్తూరు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాయలసీమ మిగిలిన భాగాల్లో చలి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగానే చల్ ఉంటుంది. కర్నూలు జిల్లాలో మాత్రం నంధ్యాల డివిజన్ లో చలి తీవ్రంగా ఉంటుంది.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు.