నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మారేడు మాన్ దిన్నె గ్రామంలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్టీసీ డ్రైవర్ చేసిన పనికి రైతు స్పందించిన తీరు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. 


నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం మారేడు మాన్‌దిన్నె. ఈ గ్రామానికి కేవలం ఒకే ఒక్క బస్సు వెళ్తుంది. అదే ఊరి నుంచి చాలా మంది రైతులు కొల్లాపూర్ పట్టణానికి వెళ్తుంటారు. సరకులు అమ్ముతుంటారు. 






అదే గ్రామానికిచెందిన గోపయ్య అనే రైతు తన పొలంలో పండిన బొప్పాయి పండ్లను నిత్యం తీసుకెళ్లేవాడు. శుక్రవారం కూడా అదే మాదరిగా తీసుకెళ్లేందుకు బస్టాప్‌లో వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో బస్‌ రానే వచ్చింది. వెళ్లి ఎక్కబోయాడు. కానీ డ్రైవర్ అడ్డు చెప్పాడు. బొప్పాయి పండ్లు ఎక్కించ వద్దని చీదరించుకున్నాడు. 






ఏ జరుగుతుందో రైతుకు అర్థం కాలేదు. పట్టణానికి వెళ్లేందుకు ఈ ఒక్క బస్సే ఉందని ఇప్పుడు కాదంటే ఎలాగని అడిగాడు. అయినా డ్రైవర్‌ వద్దంటే వద్దు పండ్లను ఎక్కించ వద్దని తెగేసి చెప్పాడు. 


ఎంత బతిమిలాడినా డ్రైవర్ వినకపోయేసరికి రైతుకు కోపం తన్నుకొచ్చింది. అంతే తాను తెచ్చిన పండ్ల బుట్టలను రోడ్డుకు అడ్డంగా పెట్టేసి పండ్లు ఎక్కిస్తావా బస్సుతో తొక్కిస్తావా అంటూ నిరసన తెలిపాడు.. 


ఉచితంగా పండ్లు అడిగితే ఇవ్వలేదన్న కక్షతోనే డ్రైవర్ ఈ పని చేశాడని తెలుస్తోంది. దీనిపై రైతు గానీ, డ్రైవర్ గానీ ఇంత వరకు స్పందించలేదు. అంతే అక్కడే ఉన్న వ్యక్తులు దృశ్యాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. 


అచ్చంపేట డిపో మేనేజర్ స్పందన డిఫరెంట్‌గా ఉంది. పండ్లు తీసుకెళ్లి వేరే చోట అన్‌లోడ్‌ చేయమన్నారని... కానీ ఆ పండ్లతో పాటు ఎవరూ రామన్న కారణంగానే లగేజ్‌ ఎక్కించుకోలేదని మేనేజర్ చెప్పారు. రిటర్న్‌లో బస్సు వచ్చిన తర్వాత పండ్ల బుట్టలను అడ్డంగా పెట్టి హంగామా చేశారని... కానీ డ్రైవర్‌, కండాక్టర్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.