కాఫీ తాగనిదే చాలా మందికి తెలవారదు. రోజూ కాఫీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని గతంలో చేసిన అధ్యయనాలు చెప్పాయి. ఇప్పుడు ఓ కొత్త అధ్యయనం అజీర్తితో బాధపడేవారికి కాఫీ మేలుచేస్తుందని తేలింది. జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కాఫీ సహాయపడుతుందని చెప్పింది ఆ పరిశోధన. ఈ పానీయం జీర్ణవ్యవస్థ, ప్రేగులపై సానుకూల ప్రభావాలను చూపిస్తుందని, పిత్తాశయంలో రాళ్లు, కాలేయ వ్యాధుల నుంచి రక్షిస్తుందని కూడా తెలిపింది. 


కాఫీ అతిగా తాగితే కెఫీన్ శరీరంలో అధికంగా చేరి అనారోగ్యాలను కలుగజేస్తుంది. కానీ మితంగా తాగితే మాత్రం చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. రోజుకు రెండు కప్పు కాఫీ చాలు శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన గ్యాస్ట్రిక్, పిత్తాశయ, ప్యాంక్రియాటిక్ స్రావాలతో కాఫీ సంబంధం కలిగి ఉన్నట్టు కూడా అధ్యయనంలో తేలింది. జీర్ణ హార్మోన్ అయిన గ్యాస్ట్రిన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి కాఫీని కనుగొన్నారు. గ్యాస్ట్రిన్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండూ పొట్టలోని ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో సహాయపడతాయి. కాఫీ కొలిసిస్టోకినిన్ స్రావాన్ని కూడా ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణక్రియలో కూడా పాల్గొంటుంది. 


కాఫీ పెద్దపేగులో కదలికలను పెంచుతుంది. గ్లాసు నీటి కంటే 60 శాతం ఎక్కువగా కాఫీ పెద్దపేగులో చలనశీలతను ప్రేరేపిస్తుంది. ఇది దీర్ఘకాలికంగా వేధిస్తున్న మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. కాలేయ క్యాన్సర్, కార్సినోమా వంటి కాలేయ వ్యాధులను సమర్ధవంతంగా  అడ్డుకుంటుందని కూడా తాజా పరిశోధన వెల్లడించింది. 


కాఫీ తాగడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాఫీ తాగితే అలసట దరిచేరదు. శక్తి, చురుకుదనం ఉత్సాహం పెరుగుతుంది. మూడ్‌ని హ్యాపీగా మార్చడంలో, ఎనర్జీ లెవెల్స్ పెంచడంతో ముందుంటుంది. ఒక కప్పు కాఫీలో విటమిన్ బి2, బి5, బి3, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. కాఫీ తాగేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. 





గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.





Also read: కదలకుండా గంటలుగంటలు టీవీ చూసే వారికి హెచ్చరిక... ఆ సైలెంట్ కిల్లర్ చంపేయచ్చు


Also read: వంటగదిలో ఈ తప్పులు మీరు చేస్తున్నారా... ఆరోగ్యానికి ముప్పు తప్పదు