ఇటీవల కాలంలో సినిమాల ప్రభావం ప్రజలపై ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకు ముందు సినిమాల్లో హీరోల హెయిర్ స్టైల్స్, డ్రస్సింగ్ అనుకరించడం చేసేవారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేశారు. పుష్ప సినిమాలో హీరో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేందుకు ఓ పాల వ్యానులో సీక్రెట్ రూమ్ ఏర్పాటు చేస్తాడు. దీంతో పైన పాలు, కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్ లో ఎర్రచందనం దుంగలను పోలీసుల కన్నుగప్పి తరలించేవాడు. ఇదే టెక్నిక్ ఫాలో అయి హీరోలు అయిపోదాం అనుకున్నారు కొందరు. కానీ రియల్ పోలీసులు సినిమా ప్లాన్ ను వర్క్ అవుట్ కానివ్వలేదు. అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.  



(సెబ్ పోలీసులు)


లారీలో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేసి రవాణా


తెలంగాణ సరిహద్దు గ్రామమైన తుమ్మలచెరువు వద్ద శనివారం భారీగా గుట్కా పట్టుబడింది. లారీలో సీక్రెట్ క్యాబిన్ ఏర్పాటు చేసి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  ఎస్ఈబీ అధికారుల తనిఖీల్లో భారీగా నిషేధిత గుట్కా పట్టుబడింది. లారీలో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేసి పుష్ప సినిమాలో లాగా స్మగ్లింగ్ కు తెగబడ్డారు. అక్రమంగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను తరిస్తున్నారన్న సమచారంతో  పిడుగురాళ్ల ఎస్ఈబీ సూపరిండెంట్ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి గుట్కా గుట్టురట్టు చేశారు. గుంటూరు జిల్లాలోని తుమ్మలచెరువు గ్రామంలో సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. 


రూ.35 లక్షల విలువైన గుట్కా సీజ్


సెబ్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా‌ ఓ మినీ లారీని వదిలి పరారయ్యారు  డ్రైవర్, క్లీనర్.  లారీని తనిఖీ చేయగా ఏం కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురైన సెబ్ పోలీసులు...లారీని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అసలు సంగతి అప్పుడు బయట పడింది.  లారీలో ఓ ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేసి అందులో గుట్కా ప్యాకెట్లను ఉంచి స్మగ్లింగ్  చేస్తున్నారని గుర్తించారు. రహస్య అరను చెక్ చేయగా అందులో  93 గోతాలలో 1.40 లక్షల గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని తెలిపారు. వీటితోపాటు మూడు బాక్సుల్లో తెలంగాణ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని  తెలిపారు. ఈ దాడులలో సెబ్ సీఐ కొండారెడ్డి మోహన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 


Also Read: డబ్బులు తీసుకుని సారా పట్టుకుంటావా?... కానిస్టేబుల్ పై సారా వ్యాపారుల దాడి... వీడియో విడుదల చేసిన పోలీసులు