చాలా మంది వెబ్ సిరీస్‌లకు అలవాటు పడ్డారు. అందులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, పని పూర్తవ్వగానే టీవీ చూసుకుంటూ గడిపేస్తున్నారు. ఇలా గంటలుగంటలు టీవీ చూస్తూ గడిపేవారిలో ఎప్పడైనా హఠాత్తుగా ‘ప్రాణాంతక పరిస్థితి’ తలెత్తే అవకాశం ఉంది. కొత్త పరిశోధన ప్రకారం సోఫాలో లేదా, మంచంపై కూర్చుని టీవీకి అతుక్కుపోయేవారిలో ‘సిరల త్రాంబోఎంబోలిజం’ (venous thromboembolism) కలిగే అవకాశం 35 శాతం ఉంది. ఇది ప్రాణాంతకంగా మారచ్చు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలిచారు పరిశోధకులు.
ఏంటీ సిరల త్రాంబోఎంబోలిజం?
కాలు, గజ్జలు, చేతుల్లో ఉండే సిరల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితిని సిరల త్రాంబోఎంబోలిజం అంటారు. సిరలు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు. ఈ రక్తనాళాల్లో రక్తప్రవాహం మందగించినా, రక్తనాళాల లైనింగ్‌కు ఏదైనా నష్టం వాటిల్లినా, రక్తం గడ్డకట్టినా కూడా ఈ పరిస్థితి సంభవిస్తుంది. నిజానికి అరవై ఏళ్లు పైబడిన వారిలో ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ఇది వైకల్యానికి, కొన్ని సార్లు మరణానికి కూడా కారణమవుతుంది.
టీవీ చూడడం వల్ల...
శాస్త్రవేత్తలు కదలకుండా కూర్చుని టీవీ చూడడం వల్ల జరిగే నష్టాలను తెలుసుకునేందుకు 2016 నుంచి 2021 మధ్య మూడు అధ్యయనాలు నిర్వహించారు. ఈ అధ్యయనాలు అమెరికా, జపాన్లలో 1,31,400 మందిపై చేశారు. ఈ పరిశోధనలో రోజుకు రెండున్నర గంటల కంటే తక్కువ సమయం టీవీ చూసే వారి కంటే రోజుకు నాలుగ్గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూసే వారిలో సిరల త్రాంబోఎంబోలిజం వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్టు తేలింది. అలాగని టీవీ చూడడం హానికరమని కాదు, అలా కదలకుండా ఎక్కువసేపు కూర్చుని చూడడమే హానికరంగా మారుతోంది. కేవలం టీవీ చూసేటప్పుడే కాదు, ఆఫీసు పని చేస్తూ కూడా ఎక్కువ సేపు కదలకుండా పనిచేసే వారిలో ఇది వచ్చే అవకాశం ఎక్కువేనని అంటున్నారు అధ్యయనకర్తలు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రవాహంలో చురుకుదనం తగ్గుతుందని, దీని వల్ల రక్తంలో గడ్డలు ఏర్పడే అవకాశం ఎక్కువని చెబుతున్నారు.
ప్రతి గంటకోసారి....
కూర్చున్న ప్రతిగంటకోసారి లేచి మూడు నిమిషాల వాకింగ్ చేయడం లేదా ఏదైనా వ్యాయామం చేయడం చాలా అవసరమని చెబుతున్నారు. ఇది అకాలమరణం కలిగే అవకాశాన్ని తగ్గిస్తుందని అంటున్నారు. రోజుకు 11 నుంచి 12 గంటల పాటూ కూర్చునే వారికి రోజుకు గంట పాటూ వ్యాయామం చేయడం చాలా అవసరమని సూచిస్తున్నారు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: వంటగదిలో ఈ తప్పులు మీరు చేస్తున్నారా... ఆరోగ్యానికి ముప్పు తప్పదు
Also read: ఆ రోగులలో కేవలం శ్వాసఆడకపోవడమే కాదు, ఇంకా ఎన్నో సమస్యలు ఉండే అవకాశం... చెబుతున్న కొత్త అధ్యయనం