Jiviputrika Festival Tragedy in Bihar: బిహార్‌ వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన వేడుకల్లో 46 మంది నీట మునిగారు. వారిలో 43 మంది మృతదేహాలు వెలికి తీయగా మరో ముగ్గురి కోసం విపత్తు నిర్వహణ బృందాలు గాలిస్తున్నాయి. మృతుల్లో 37 మంది చిన్నారులు ఉండడంతో బిహార్ వ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున సీఎం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరిహారం ప్రకటించారు.


పుణ్య స్నానాలకు వెళ్లి..


పండుగ వేళ బిహార్ కన్నీరు మున్నీరవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జితియా వేడుకల్లో పుణ్య స్నానాల కోసం చెరువులు, కుంటలు, నదుల్లో మునిగి దాదాపు 43 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 37 మంది చిన్నారులు ఉన్నారు. బిహార్‌లోని 15 జిల్లాలు పండగ పూట పిల్లల్ని కోల్పోయి గర్భశోకంతో అల్లాడుతున్నాయి. చిన్నారుల బాగు కోరి చేసే ఈ జివిత్‌ పుత్రికా పర్వదినమే ఆ 37 మంది పిల్లకు ఆఖరి రోజు కావడంతో పిల్లలను పోగొట్టుకొన్న తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. తూర్పు చంపారన్‌, పశ్చిమ చంపారన్‌, నలంద, ఔరంగాబాద్‌, కైమూర్‌, బక్సర్‌ సహా మరి కొన్ని జిల్లాల్లో ఈ మరణాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఈ పండుగ రోజున ఇంట్లో ఉండే ఆడవాళ్లు రోజంతా ఉపవాసం చేసి సాయంత్రం పుణ్య స్నానాలు చేయడం ద్వారా పిల్లలకు మంచి జరుగుతుందని భావిస్తారు.


మృతుల్లో మహిళలు కూడా 7 మంది వరకూ ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ మహా విషాదంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అటు.. ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఇంత పెద్ద పండుగకు కనీసం ఏర్పాట్లు చేయక పోవడం వల్లే ఇంత పెద్ద ఘోరం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నితీశ్ సర్కారు నిష్క్రియాపరత్వం వల్లే బిహార్ ఇంత మంది చిన్నారులను, అమ్మలను కోల్పోవాల్సి వచ్చిందని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు.


అసలేంటీ ఈ జివిత్‌పుత్రికా ఫెస్టివల్?


జివిత్ పుత్రికా లేదా జితియా ఫెస్టివల్‌ను ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో జరుపుకొంటారు. బుధవారం బిహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌తో పాటు నేపాల్‌లో కూడా నిర్వహించారు. తల్లులు ఈ పండుగను నిర్వహిస్తారు. తమ బిడ్డలు ఆరోగ్యంగా, సకల సంపదలతో ఉండాలని కోరుకుంటూ రోజంతా ఉపవాసం చేస్తారు. 3 రోజుల పాటు ఈ వేడుక జరుగుతుంది. నిర్జల ఉపవాసం కూడా ఇందులో భాగం. అంటే చుక్క మంచి నీళ్లు కూడా ముట్టుకోరు. ఇలా చేస్తే తమ బిడ్డలకు ఆ దేవదేవుడి ఆశీర్వాదం ఉంటుందని విశ్వసిస్తారు. ఈ పండుగ భారతీయ ఐతిహాసికాల నుంచి వస్తుంది. 


జిముతవాహన అనే చక్రవర్తి తన రాజ్యంలోని పిల్లల కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడని అతడిపై గౌరవంగా ఈ పండుగ ఉత్తర భారతంలో జరుపుకొంటూ ఉంటారు. మూడు రోజుల ఫెస్టివల్‌లో తొలి రోజు తల్లులు తల స్నానం చేసి దేవుడి దగ్గర ప్రసాదాన్ని కొద్దిగా తీసుకుంటారు. రెండో రోజు కఠినమైన ఉపవాసం ఆచరిస్తారు. మూడో రోజు పుణ్య స్నానాలు ఆచరించి భోజనం తీసుకోవడంతో ఆ ఫెస్టివల్ ముగుస్తుంది. పిల్లల కోసం నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నారులే చనిపోవడం బిహార్ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది.