NTR Eemotional Post About Devara: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి అడుగు పెట్టింది. గత మూడు సంవత్సరాలుగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా అభిమానుల ముందుకు వచ్చింది. ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. తొలుత ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.   


మనసు పులకిస్తోందంటూ ఎన్టీఆర్ ఎమోషనల్


‘దేవర’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. “ఎట్టకేలకు అనుకున్న రోజు వచ్చింది. మా సినిమా మీద మీరు చూపిస్తున్న అభిమానాన్ని చూసి ఎంతో సంతోషంగా ఉంది. అద్భుతమై డ్రామా, భావోద్వేగాలతో ‘దేవర’ను తీర్చిదిద్దిన కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రియమైన సోదరుడు అనిరుధ్, అద్భుతమైన మ్యూజిక్ తో ఈ సినిమాకు ప్రాణం పోశాడు. ఈ సినిమాకు బలమైన మద్దుతగా నిలిచిన నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం పని చేసిన సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ సహా ప్రతి ఒక్క టెక్నీషియన్ కు ధన్యవాదాలు. దేవర’ కోసం నా అభిమానులు చేసే సెలబ్రేషన్స్ చూసి మనసు పులకరించిపోతోంది. మీ ప్రేమను ఎప్పటికీ ఇలాగే చూపించాలని కోరుకుంటున్నాను. మీ అభిమానానికి  ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ అందరినీ ఇలాగే అలరిస్తూ ఉంటానని అభిమానులకు హామీ ఇస్తున్నాను” అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  






ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు


ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా అర్థరాత్రి నుంచి థియేటర్లలో అలరిస్తోంది. సుమారు 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలోగా చేసిన ఈ సినిమాకు ప్రేక్షకులను అనూహ్య మద్దతు లభిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యయెల్ రోల్ పోషించారు. దేవర, వర పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయి నటించారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తంగం అనే యువతి పాత్రలో అద్భుతంగా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించారు.  ఎన్నో అంచనాల మధ్య ‘దేవర’ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.  'దేవర' మూవీని ఎన్టీఆర్  ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. యువ సంగీత తరంగం అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.  



Read Also:  దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?