Swiggy IPO News Updates: ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ, తన ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) కోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి (SEBI) అప్‌డేటెడ్‌ డ్రాఫ్ట్‌ను సమర్పించింది. అప్‌డేటెడ్‌ డ్రాఫ్ట్‌లో ఉన్న విషయాల ప్రకారం, ఈ IPOలో రూ. 3,750 కోట్ల విలువైన ఫ్రెష్‌ షేర్లను జారీ చేస్తుంది. దీంతోపాటు, 18.52 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) చేస్తుంది. ఈ వారం ప్రారంభంలో, ప్రతిపాదిత IPO కోసం సెబీ నుంచి అనుమతి పొందింది. ఈ కంపెనీ, రహస్య ఫైలింగ్‌ ఆప్షన్‌ను ఉపయోగించుకుని IPO కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో డ్రాఫ్ట్‌ పేపర్స్‌ సమర్పించింది.


IPO సైజ్‌
IPO లీడ్‌ బ్యాంకర్స్‌ చెబుతున్న ప్రకారం, స్విగ్గీ IPO పరిమాణం సుమారు 1.25 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చు. అంటే, భారతీయ కరెన్సీలో రూ. 10,000 కోట్లకు పైమాటే. అయితే, IPO ప్రారంభానికి ముందు దీనిని ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది. నేషనల్‌ మీడియా రిపోర్ట్‌ను బట్టి చూస్తే, వాటాదార్ల సమావేశం తర్వాత, IPO సైజ్‌ను సుమారు 1.4 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 11,700 కోట్లు) పెంచొచ్చు. 


రెండో అతి పెద్ద స్టార్టప్ IPO
స్విగ్గీ IPO నవంబర్ 2024 ప్రారంభంలో ఓపెన్‌ అవుతుంది. పరిమాణం పరంగా, స్విగ్గీ పబ్లిక్‌ ఆఫర్ దేశంలోని అతి పెద్ద IPOల్లో ఒకటిగా ఉంటుంది. స్టార్టప్ కంపెనీల్లో, పేటీఎం (Paytm) తర్వాత ఇది రెండో అతి పెద్ద IPO కావచ్చు. పేటీఎం రూ.18,300 కోట్ల IPOని తీసుకొచ్చింది. ఇప్పటివరకు, భారతీయ మార్కెట్‌లోని ఏ స్టార్టప్ కంపెనీలోనైనా ఇదే అతి పెద్ద IPO. ఫుడ్ డెలివరీ విభాగంలో స్విగ్గీకి జొమాటో (Zomato) గట్టి పోటీదారు. జొమాటో, 2021లో రూ.9,375 కోట్ల IPOతో మార్కెట్‌లోకి అడుగు పెట్టింది.


సెలబ్రిటీల పెట్టుబడులు
స్విగ్గీ ఐపీవోకి, ప్రారంభానికి ముందే గొప్ప రెస్పాన్స్‌ వస్తోంది. ET రిపోర్ట్‌ ప్రకారం, అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ఇప్పటికే 2 లక్షల స్విగ్గీ షేర్లను వివిధ ప్రముఖులు కొనుగోలు చేశారు. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన బాలీవుడ్‌ స్టార్ల లిస్ట్‌లో.. అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, కరణ్ జోహార్, ఆశిష్ చౌదరి పేర్లు ఉన్నాయి. క్రీడా ప్రపంచం నుంచి.. మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్‌తో పాటు టెన్నిస్ హీరో రోహన్ బోపన్న కూడా స్విగ్గీ షేర్లు కొనుగోలు చేశాడు. పారిశ్రామికవేత్త రితేష్ మాలిక్ కూడా స్విగ్గీ ప్రి-ఐపివోలో పెట్టుబడి పెట్టారు.


భారీగా పెరిగిన షేర్‌ ధర
అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో స్విగ్గీ IPOకి చాలా హైప్ ఉంది. ET రిపోర్ట్‌ ప్రకారం, ఈ సంవత్సరం జులైలో, అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ఒక్కో స్విగ్గీ షేర్‌ దాదాపు 355 రూపాయల వరకు ట్రేడయింది. ఇప్పుడు షేర్‌ ధర దాదాపు రూ.490కి పెరిగింది. అంటే కేవలం రెండు నెలల్లోనే ఈ షేరు దాదాపు 40 శాతం జంప్ చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: నెలలో 26 శాతం పెరిగిన వంటనూనె ధరలు - టైమ్‌ చూసి పెట్టిన వాత ఇది