Biggest IPO In Indian Stock Market: భారత స్టాక్ మార్కెట్‌లోని అద్భుతమైన బుల్లిష్ ట్రెండ్ కారణంగా IPO మార్కెట్‌లో కూడా ఉత్సాహంతో ఉరకలేస్తోంది, ఆ ఆవేశం ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. ప్రతి వారం, షేర్ మార్కెట్‌లోకి చాలా కొత్త IPOలు రిలీజ్ అవుతున్నాయి, వాటిలా చాలా వరకు హిట్ అవుతున్నాయి & పెట్టుబడిదార్ల జేబులను నిండుగా నింపుతున్నాయి. చాలామంది చిన్న ఇన్వెస్టర్లు లిస్టింగ్ గెయిన్స్‌ను ఒక ఆదాయ అవకాశంగా చూస్తున్నారు, వచ్చిన ప్రతి పబ్లిక్ ఆఫర్‌లో బిడ్ వేస్తున్నారు. కాగా, ఇప్పుడు ఎల్‌ఐసీ అతి పెద్ద ఐపీఓ రికార్డు బద్దలు కానుంది. దేశీయ మార్కెట్ చరిత్రలోనే అతి పెద్ద కొత్త IPO త్వరలో ప్రారంభం కానుంది.
హ్యుందాయ్ IPOకి సెబీ ఆమోదం
దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్, త్వరలో, తన ఇండియన్ యూనిట్ IPOని తీసుకురాబోతోంది. హ్యుందాయ్ ఇండియా IPO ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అయితే, దీనిపై హ్యుందాయ్ కానీ, సెబీ కానీ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు.
టాప్-3లో ఒకటి
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఉన్న టాప్-3 కంపెనీల్లో హ్యుందాయ్ ఇండియా ఒకటి. భారత మార్కెట్‌లో IPOని ప్రారంభించేందుకు ఈ కంపెనీ సుమారు 3 నెలల క్రితం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ దాఖలు చేసింది. హ్యుందాయ్ ఇండియా, తన ఐపీవో కోసం JP మోర్గాన్, సిటీ గ్రూప్, HSBC వంటి చాలా పెద్ద బ్యాంకర్లను మేనేజర్లుగా నియమించింది.
బాహుబలి IPO కావచ్చు
హ్యుందాయ్ ఇండియా ప్రతిపాదిత IPO సైజ్ 3 బిలియన్ డాలర్లు కావచ్చని రాయిటర్స్ కొన్ని నెలల క్రితం తన న్యూస్ రిపోర్ట్స్‌లో రాసింది. భారతీయ కరెన్సీ ప్రకారం ఆ లెక్క రూ.25,000 కోట్లు దాటుతుంది. ప్రస్తుతం, భారతీయ మార్కెట్‌లో అతి పెద్ద IPOని తీసుకువచ్చిన రికార్డ్ ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పేరిట ఉంది. ఈ కంపెనీ, దాదాపు రెండేళ్ల క్రితం, 2022 మే నెలలో సుమారు రూ.21,000 కోట్ల విలువైన IPOను నిర్వహించింది. అంటే, అనుకున్న సైజ్‌లో హ్యుందాయ్ ఇండియా ఐపీఓ వస్తే, ఎల్ఐసీ పేరిట ఇప్పటివరకు ఉన్న "అతి పెద్ద ఐపీఓ" రికార్డ్ బద్దలవుతుంది.
రెండు దశాబ్దాల తర్వాత కార్ల కంపెనీ ఐపీఓ
హ్యుందాయ్ ఇండియా, ప్రతిపాదిత IPOలో కంపెనీ విలువను 30 బిలియన్ డాలర్ల వరకు అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత మార్కెట్లో ఓ కార్ కంపెనీ ఐపీఓ కాబోతోంది. 2003లో మారుతి సుజుకి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయింది, అదే కార్ల కంపెనీ చివరి IPO.
ప్రపంచ దేశాల్లో హ్యుందాయ్ చేస్తున్న వ్యాపారంలో భారతీయ మార్కెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికా, దక్షిణ కొరియా తర్వాత భారత్ మార్కెట్ నుంచే ఈ కంపెనీ అత్యధికంగా సంపాదిస్తోంది.
మరో ఆసక్తికర కథనం: చిన్న పొరపాటుకు భారీ మూల్యం, రూ.382 కోట్ల ఐటీ నోటీస్ - మీకూ రావచ్చు!