దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric Mobility) IPO ధరలను ప్రకటించింది. ఆగస్టు 2, 2024న సబ్‌స్క్రిప్షన్‌ని ప్రారంభించనుంది. ఈ తాజా ఇష్యూ ద్వారా సుమారు రూ. 5,500 కోట్లను సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు 1 నుంచి యాంకర్ రౌండ్‌ బిడ్స్‌ కూడా దాఖలు చేయవచ్చు. దీని షేర్‌ ధర రూ. 72-76గా పేర్కొంది.


రిటైల్ పెట్టుబడిదారులు ఆగస్టు 2 నుంచి ఆగస్టు 6 మధ్య తమ బిడ్‌లను దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత EV కంపెనీ ఆగస్టు 9న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌ అయ్యే అవకాశం ఉంది. IPOని ప్రారంభించిన తొలి భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్‌ నిలించింది.


ఈ ఐపీఓ (Ola Electric IPO) ఆగస్టు 2న ప్రారంభమై 6న ముగియనుంది. యాంకర్‌ మదుపర్లు ఆగస్టు 1న బిడ్లు దాఖలు చేయొచ్చు. ఇష్యూలో భాగంగా రూ.5,500 కోట్ల వరకు కొత్త షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 8.49 కోట్ల షేర్లను ప్రమోటర్లు, పెట్టుబడిదార్లు విక్రయించనున్నారు. ఈ ఐపీఓలో మదుపర్లు గరిష్ఠ ధర రూ.14,820తో 195 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఐపీఓలో ఆ కంపెనీ ఉద్యోగులు పాల్గొనవచ్చు. వారు కొనుగోలు చేసే ఒక్కో షేరుపై రూ.7 డిస్కౌంట్‌ లభించనుంది.


ఐపీఓలో సమీకరించిన నిధుల్లో రూ.1,600 కోట్లు రీసెర్చ్‌ కోసం, ఇతర అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ వెల్లడించింది. ఇక రూ.1,227 కోట్లను సెల్ తయారీ కోసం ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థ విస్తరణ కోసం ఉపయోగిస్తామని పేర్కొంది.  మరో రూ.800 కోట్లను లోన్స్‌ కింద చెల్లిస్తామని పేర్కొంది. 


IPO వివరాలు , మార్కెట్ విలువ


సాఫ్ట్‌బ్యాంక్-మద్దతుగల ఈ IPOలో ఓలా ఈవీ కంపెనీకి సుమారు 4.5 బిలియన్ల విలువను పొందుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వాల్యుయేషన్ దాని మునుపటి ఫండింగ్‌ రౌండ్‌ 5.5 బిలియన్లతో పోల్చితే దాదాపు 18% తక్కువగా ఉంది. డిసెంబర్ 22, 2023న ఓలా ఎలక్ట్రిక్ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ని SEBIకి సమర్పించింది. జూన్ 20 నాటికి, దాని IPO కోసం మార్కెట్ రెగ్యులేటర్ నుంచి అనుమతి పొందింది. ఐపీఓలో ఆమోదం లభించిన తొలి టూవీలర్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ రికార్డు నెలకొల్పింది.


వాటాదారులు & విక్రయాలు


ఈ IPOలో, వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ 4.74 కోట్ల షేర్లను (3.48% వాటా) విక్రయించే ఆలోచనలో ఉన్నారు. ఇండస్ ట్రస్ట్, ఆల్పైన్ ఆపర్చునిటీస్ ఫండ్, డిఐజి ఇన్వెస్ట్‌మెంట్స్, ఇంటర్నెట్ ఫండ్-3 (టైగర్ గ్లోబల్), మాక్‌రిట్చీ ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్, ఆల్ఫా వేవ్ వెంచర్స్, టెక్నే ప్రైవేట్ వెంచర్స్ వంటి ఇతర వాటాదారులు ఈ సేల్‌లో పాల్గొంటున్నాయి.


ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులోని ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో EVలు, బ్యాటరీ ప్యాక్‌లు, మోటార్లు , వాహన ఫ్రేమ్‌ల వంటి కీలక భాగాలను తయారు చేస్తుంది. 10 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల ప్లాంట్‌గా విస్తరిస్తోంది. సరికొత్త టెక్నాలజీతో ఎప్పటికప్పుడు కస్టమర్లకు బెస్ట్‌ సర్వీస్‌ని అందిస్తూ ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ విభాగంలో తిరుగులేని శక్తిగా ఓలా ఎలక్ట్రిక్‌ ఎదుగుతోంది. 


భవిష్యత్తు ప్రణాళికలు 


ఈ కంపెనీ లిథియం-అయాన్ బ్యాటరీ ఉత్పత్తి కోసం తమిళనాడులో గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. దీని ద్వారా గంటకు 5 GW (Gigawatt) సామర్థ్యంతో ఉత్పత్తి చేయనుంది. రానున్న రోజుల్లో గంటకు 100 GWకి పెంచే యోచనలో ఓలా ఎలక్ట్రిక్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ కీలకంగా ఉంది. ఈ ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఏథర్ ఎనర్జీ, బజాజ్ , TVS మోటార్ కంపెనీ వంటి ఇతర EV తయారీదారులతో పోటీపడుతోంది.


Also Read: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?