Rs 382 Crore IT Notice To An Employee In Money Laundering Case: థానేలో నివశిస్తున్న ఓ వ్యక్తి మొత్తం అధికార యంత్రాంగాన్ని బురిడీ కొట్టించి వందల కోట్ల రూపాయలను అక్రమంగా తరలించాడు. చాలా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి అక్రమాలు కొనసాగించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆదాయ పన్ను విభాగం (Income Tax Department) అతని ఆనుపానులు పట్టుకుని, కోట్ల రూపాయల పన్ను ఎగవేత నోటీస్‌ పంపింది. ఈ షాకింగ్ సంఘటన మహారాష్ట్రలోని థానేలో వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత జరిగిన ట్విస్ట్‌లు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి.


రూ.382 కోట్ల ఐటీ నోటీస్‌
థానేలోని ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కు ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీస్‌ అందింది. నోటీస్‌లో ఉన్న సమాచారం ప్రకారం... ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మొత్తం రూ. 382 కోట్ల మేర మనీ లాండరింగ్‌ చేశాడు, టాక్స్‌ ఎగవేతకు పాల్పడ్డాడు. సదసు మోసగాడు తన పేరుపై చాలా బ్యాంక్‌ అకౌంట్లు తెరవడమే కాకుండా, నకిలీ సంస్థల ద్వారా అక్రమంగా డబ్బును విత్ డ్రా చేశాడు. కాబట్టి, ఎగవేసిన పన్ను బకాయిలను వెంటనే ఆదాయ పన్ను శాఖకు జమ చేయాలని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సరైన లెక్కలు చూపించాలని ఆ నోటీస్‌లో ఐటీ డిపార్ట్‌మెంట్‌ సూచించింది. అంతేకాదు, ఎగవేసిన పన్ను చెల్లించకపోయినా, లెక్కలు చూపించకపోయినా కేసు పెట్టి కటకటాల్లోకి నెట్టిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో, ఆ నోటీస్‌ పట్టుకుని రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ నేరుగా ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్లాడు. అక్కడ జరిగిన సీన్‌లో ఇటు రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌, అటు ఐటీ అధికార్లు అవాక్కయ్యారు.


అతని జీతమెంత, చేసిన మోసమెంత?
విషయం ఏంటంటే... థానేలోని ఒక మామూలు ప్రాంతంలో నివశిస్తున్న ఆ వ్యక్తి, ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. అతని నెల జీతం దాదాపు రూ. 20,000. ఇంటి ఖర్చులకు కూడా చాలీచాలని రూ.20 వేల జీతంతో పని చేస్తున్న వ్యక్తి వందల కోట్ల రూపాయల లావాదేవీలు ఎలా చేయగలడు?. అతను నిజంగా చాలా కంపెనీలకు ఓనర్‌ అయితే, ఇంకెక్కడో పని చేయాల్సిన అవసరం ఏంటి?. ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరికాయి.


రెండేళ్ల క్రితం, ఓ వ్యక్తి రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కు చెందిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో, సంతకం చేసిన చెక్కును తీసుకున్నారు. ఆ డాక్యుమెంట్లతో చాలా బ్యాంకు ఖాతాలు తెరిచి డబ్బును అక్రమంగా తరలించారు. ఆ అకౌంట్ల ద్వారా రూ. 382 కోట్ల భారీ మొత్తంలో లాండరింగ్ చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌పై ఆ నింద పడింది. ఆ తర్వాత ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఒకే వ్యక్తి పేరిట ఉన్న బ్యాంక్‌ ఖాతాల నుంచి ఇంత పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్‌ జరగడం సైబర్ ఇన్వెస్టిగేట్‌ ఆఫీసర్లను మాత్రమే కాదు, మొత్తం థానే నగర పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది.


మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకే ఈ సమాచారం
చాలా మంది మోసగాళ్లు ఇదే తరహాలో ప్రజలను బుట్టలో వేస్తున్నారు. ఏదోక ప్రయోజనాన్ని ఆశగా చూపి ప్రజల ఆధార్‌, పాన్‌ సహా కీలక వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగా ఆర్థిక మోసాలు చేస్తున్నారు. ఆ మోసం బయటపడినా మోసగాళ్లు బయటకు రారు, ప్రజలు బలి పశువులు అవుతారు. ఈ తరహా మోసాల గురించి ఆదాయ పన్ను విభాగం, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పోర్టల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఆధార్ కార్డ్, వంటి ముఖ్యమైన పత్రాల గురించి అపరిచితులకు సమాచారం ఇవ్వకూడదని తరచూ హెచ్చరిస్తున్నాయి. అయినా, ప్రజలను ప్రలోభ పెట్టి మోసగాళ్లు తమ ఆట కొనసాగిస్తూనే ఉన్నారు. కాబట్టి, ఎలాంటి డబ్బు స్కామ్‌లో చిక్కుకోకుండా మిమ్మల్ని అప్రమత్తం చేసే ప్రయత్నమే ఈ కథనం.


మరో ఆసక్తికర కథనం: దసరా నుంచి దీపావళి వరకు - అక్టోబర్‌లో బ్యాంక్‌లకు భారీగా సెలవులు