Jagtial News : జగిత్యాల జిల్లా మల్యాల మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన నక్క అనిల్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. మల్యాల ఎస్ఐ చిరంజీవి వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు అనిల్. పురుగుల మందు తాగుతున్నానని చేతిలో డబ్బాతో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనను మల్యాల ఎస్ఐ చిరంజీవి వేధింపులకు గురిచేస్తూ అక్రమంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారని దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు వీడియోలో వివరించారు అనిల్. పోలీసులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా అతను ఉన్న లోకేషన్ కనుగొని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సమయానికి అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. బాధితుడి ఆరోపణలపై విచారణ చేస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. అయితే అనిల్ సెల్ఫీ వీడియో స్థానికంగా వైరల్ అయింది. బాధితుడి న్యాయం చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు పేదలకు న్యాయం చేయాల్సిపోయి వారిని డబ్బుల కోసం వేధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ఎస్ఐ వేధింపులు 


"నేను వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను. నాకు ఒక బ్లేడ్ బండి ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన 20 కుంట్ల భూమి ఉంది. దానిని కబ్జా చేశారు. ఈ విషయాన్ని ఎస్ఐ దృష్టికి తీసుకెళ్తే కబ్జా చేసిన భూమి ఇప్పించేందుకు రూ.3 లక్షలు తీసుకున్నారు. డబ్బులు తీసుకుని నాకు భూమి ఇప్పించలేదు. డబ్బులు తిరిగిమ్మని అడిగినందుకు నాపై అక్రమంగా ఏడు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసి కొట్టి బలవంతంగా సంతకం చేయించాలని చూశారు. నేను సంతకం పెట్టకపోయేసరికి ఎస్ఐ నా సంతకం ఫోర్జరీ చేశారు. ఎస్ఐ నన్ను మానసికంగా వేధిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందికి గురిచేస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తే నాపై పీడీ యాక్ట్ పెడతానని బెదిరించారు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలున్నారు. నేను చనిపోతున్నా నా కుటుంబానికి న్యాయం చేయండి" -సెల్ఫీ వీడియోలో అనిల్ 


వ్యక్తిగత కక్షతో 


"మా అన్నను బెదిరించి రూ.3 లక్షలు తీసుకున్నారు. మళ్లీ రూ.5 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. ఇవ్వలేదని మా అన్నపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. 11వ తేదీన మా అన్న వాళ్ల అత్తింటికి పోతే అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. మా అన్న తరఫున వచ్చి ఫిర్యాదు చేస్తే నా కంప్లైంట్ తీసుకోవడంలేదు. నీకు సంబంధం ఏంటి అంటున్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు వచ్చి డోర్ కొడుతున్నారు. డబ్బులు కావాలంటూ బెదిరిస్తున్నారు. మా అన్న ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు. భూ విషయంలో అక్రమ కేసులు పెడుతూ హింసిస్తున్నాడు ఎస్ఐ చిరంజీవి. ఎవరైనా హత్య చేశాడా? దొంగతనం చేశాడా? ఎందుకు ఇలా వేధిస్తున్నారు. ఎస్ఐ చిరంజీవిపై చర్యలు తీసుకోవాలి." -అనిల్ సోదరి.