Asaduddin Owaisi On Modi: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగ రేటును ఆయుధంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్‌లోని దానిలిమ్డా నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ పాల్గొన్నారు.
"నేను బస చేసిన హోటల్‌లో ఒక యువకుడిని కలిశాను. అతను తన పరిస్థితి గురించి నాతో ఇలా సరదాగా జోక్ రూపంలో చెప్పాడు. ఓ కుర్రాడితో తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి ఇలా అంటుందట.
అమ్మాయి: నీకు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? మా నాన్న నాకు వరుడి కోసం వెతుకుతున్నారు.
కుర్రాడు: మోదీ ప్రభుత్వాన్ని నమ్ముకోవద్దు. నువ్వు మరొకరిని పెళ్లి చేసుకో."
యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఒవైసీ గుర్తు చేశారు.
బరిలోకి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతోంది ఏఐఎమ్ఐఎమ్. తామ పార్టీ 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఏఐఎమ్ఐఎమ్ రాష్ట్ర అధ్యక్షుడు సబీర్ కబ్లీవాలా తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీ ఉనికి కేవలం 26 స్థానిక సంస్థల స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ ముస్లిం, దళితుల ఓట్లపైనే దృష్టి సారించింది.
ఎన్నికల షెడ్యూల్
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 2023, ఫిబ్రవరి 18తో ముగియనుంది.
డిసెంబర్ 1న గుజరాత్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనుంది.
2017లో
గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది.
Also Read: Twist In Shraddha Murder Case: 'ముక్కలుగా నరికేస్తానని బెదిరిస్తున్నాడు'- 2020లోనే శ్రద్ధా ఫిర్యాదు!