Notice To BL Santosh : ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులివ్వాలని సిట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ సీఆర్‌పీసీ కింద వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపాలని తెలిపింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది. ఉదయం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ కాలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను హైకోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన తర్వాత హైకోర్టు ధర్మాసనం వాదనలు విన్నది.
బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. సుప్రీంకోర్టు ఎక్కడా దర్యాప్తుపై స్టే ఇవ్వలేదని ఈ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. కేసుతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు బీఎల్ సంతోష్ సహకరించడం లేదని, 41ఏ సీఆర్‌పీసీ ప్రకారం విచారణకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. బీఎల్ సంతోష్ గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాడని మహేష్ జెఠ్మలానీ కోర్టుకు తెలిపారు. ఎప్పటి వరకు సమయం కావాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 29న నివేదిక సమర్పించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఉందని ఏజీ పేర్కొన్నారు.
బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కావడం లేదని విచారణ ఆలస్యం అవుతుందనని అదనపు ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని ..అరెస్ట్ చేయవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాల్ని ఎత్తివేయాలని కోరారు. అయితే హైకోర్టు అంగీకరించలేదు. నిజానికి బీఎల్ సంతోష్‌కు మంగళవారమే నోటీసులు ఇచ్చామని కోర్టుకు సిట్ తరపు న్యాయవాదులు తెలిపారు. తెలంగాణ సిట్ జారీచేసిన నోటీసును ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలోని హేమేందర్ అనే వ్యక్తికి అందజేశారని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో బీఎల్ సంతోష్ లేరని, గుజరాత్‌లో ఉన్నారని పేర్కొన్నారు. సిట్ నోటీసుల జారీకి సంబంధించి ఢిల్లీ పోలీసులు అందజేసిన వివరాలను కోర్టుకు నివేదించారు. అయితే ఈ సారి నేరుగా ఆయనకే మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా నోటీసులు అందించాలని హైకోర్టు ఆదేశించింది.
మరో వైపు సిట్ నుంచి కేసును బదిలీ చేయాలని కోరుతూ ఎమ్మెల్యేల ఎర కేసు నిందితులు రామచంద్రభారతి, కోరె నందకుమార్, సింహయాజి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. నిందితులు జైల్లో ఉన్నందున సంతకాలు చేయలేకపోయారని, సిట్‌ను రద్దు చేసి, కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ వారి తరఫున న్యాయవాది వీ కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు.అదే సమయంలో అరెస్ట్ అయిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి ఏసీబీ కోర్టులో సిట్ పోలీసులు పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరగాల్సి ఉంది. వచ్చే వారం రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.