Teenmar Mallanna Office Attacked : హైదరాబాద్ లో  తీన్మార్ మల్లన్న Qnews ఆఫీస్ పై దాడి జరిగింది. గుర్తుతెలియని కొంత మంది ముఖాలకు ముసుగులు వేసుకుని క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేసి ఫర్నిచర్ దాడి చేశారు. దుండగుల దాడిలో క్యూ న్యూస్ ఆఫీస్ పూర్తిగా ధ్వంసం అయింది. ఆఫీస్ లో పనిచేస్తున్న జర్నలిస్టులపై కూడా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఓ మంత్రి అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.  


క్యూ న్యూస్ ఆఫీస్ పై మంత్రి అనుచరులు దాడి!


హైదారాబాద్ లోని తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీస్ పై దుండగులు దాడి చేశారు. సుమారు 25 మంది గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా క్యూ న్యూస్ ఆఫీస్ లో చొరబడి కత్తులు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఫిర్జాదిగూడలోని క్యూ న్యూస్ ఆఫీస్ లోకి దూసుకొచ్చిన అగంతకులు ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యూ న్యూస్ ఆఫీస్ కి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఒకరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది.  మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమ కార్యాలయంపై దాడి చేశారని మల్లన్న టీమ్ ఆరోపిస్తుంది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని క్యూ న్యూస్ టీమ్ డిమాండ్ చేస్తోంది. 


మల్లారెడ్డి అనుచరులేనని ఆరోపణ 


ఈ దాడిలో ఆఫీస్ ఫర్నీచర్, అద్దాలు, కంప్యూటర్లు, కూర్చీలు, టీవీలతో పాటు ఇతర వస్తువులు, సామాగ్రి ధ్వంసం అయ్యాయని క్యూన్యూస్ సిబ్బంది చెప్పారు. ఇదంతా మంత్రి మల్లారెడ్డి అనుచరుల పనని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాయొద్దని దాదాపు 25 మంది దుండగులు క్యూ న్యూస్ ఆఫీస్ కు వచ్చి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని సిబ్బంది ఆరోపించారు. ప్రజల గొంతుకను వినిపిస్తున్న తమపై ఇలా భౌతిక దాడులు చేయడం సరికాదని తీన్మార్ మల్లన్న అనుచరులు, ఆఫీస్ సిబ్బంది రోడ్డుపై బైఠాయించి నిరనస తెలిపారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు క్యూ న్యూస్ ఆఫీస్ కు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 


నాలుగు సార్లు దాడి, ఒక్కర్నీ అరెస్టు చేయలేదు- మల్లన్న


ఈ దాడిపై తీన్మార్ మల్లన్న స్పందించరు. తాను బయటకు వెళ్లినప్పుడు ఆఫీసుపై దాడి చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. నెంబర్ ప్లేట్ లేని మూడు కార్లలో వచ్చిన దుండగులు దాడి చేశారన్నారు. పోలీసులకు తెలిసే ఈ దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో పోలీసుల పాత్ర కూడా ఉందన్నారు. గతంలో జరిగిన దాడికి సంబంధించి ఒక్కరిని కూడా పోలీసులు  పట్టుకోలేదని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఇప్పటికి నాలుగు సార్లు క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి జరిగిందన్నారు.  క్యూన్యూస్ ఆఫీస్ ఖాళీ చేయించాలని పోలీసులు కూడా బెదిరిస్తున్నారని మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు.