దోశె, ఇడ్లీ, వడ...ఇవే బ్రేక్ ఫాస్ట్‌లు తిని తిని బోరు కొట్టిందా? అయితే ఇలా పెసర, సొరకాయ దోశెలు వేసుకుని తినండి. కొబ్బరి చట్నీతో ఈ దోశెను తింటే రుచి మామూలుగా ఉండదు. ఆరోగ్యానికి పెసర్లు, సొరకాయ... రెండూ మేలే చేస్తుంది. కాబట్టి వీటిని తినడం వల్ల అంతా ఆరోగ్యమే. 


కావాల్సిన పదార్థాలు
పెసర పప్పు - ఒక కప్పు
సొరకాయ ముక్కలు - ఒక కప్పు
బియ్యప్పిండి - ఒక స్పూను
అల్లం ముక్క - చిన్నది
పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర - ఒక కట్ట
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా


తయారీ ఇలా 
1. పెసర పప్పు ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. 
2. ఉదయం మిక్సీలో పెసరపప్పు, అల్లం, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 
3. ఆ మిశ్రమం మరీ జారుగా కాకుండా గట్టిగా రుబ్బుకోవాలి. 
4. సొరకాయ ముక్కలను కూడా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 
5. ఆ సొరకాయ పిండిని పెసరపప్పు మిశ్రమంలో కలుపుకోవాలి. 
6. అందులో కొత్తిమీర తరుగు, బియ్యప్పిండి, ఉప్పు కలుపుకోవాలి. 
7. పిండి మరీ గట్టిగా ఉండే కాస్త నీళ్లు కలుపుకోవచ్చు. 
8. స్టవ్ పై పెనం పెట్టి నూనె వేసుకోవాలి. పిండిని దోశెలా వేసుకోవాలి. 
9. రెండు వైపులా కాల్చుకుని కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరు. 


పెసరపప్పు తినడం వల్ల బరువు పెరగరు. కాబట్టి పెసరట్టును తరచూ చేసుకుని తింటే మంచిది. పెసరట్టు తినడం వల్ల త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. తద్వారా ఎక్కువ తినకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. పెసరపప్పులో పొటాషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. అందువల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. అంతే కాదు పెసర్లు అధిక రక్తపోటు బారిన పడకుండా కాపాడతాయి. కండరాల తిమ్మిరి, నొప్పులను తగ్గించడంలో ఇవి ముందుంటాయి. వీటిలో మెగ్నీషియం, రాగి, ఫోలేట్, ఫైబర్, విటమిన్ బి6 వంటి ఆవశ్యక పోషకాలు ఉంటాయి. 


సొరకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాల్షియం, విటమిన్ సి, ఫాస్పరస్, బి కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది. సొరకాయ తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. కాబట్టి సొరకాయ దోశె వేసవిలో తినడం వల్ల శరీరానికి చల్లదనం వస్తుంది. సొరకాయల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఆయుర్వేదం చెప్పిన ప్రకారం సొరకాయ, పెరుగు కలిపి తింటే ఎంతో ఆరోగ్యం. సొరకాయ తినడం వల్ల శరీరానికి అందే కేలరీలు చాలా తక్కువ. కాబట్టి బరువు పెరుగుతామన్న భయం అవసరం లేదు. మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్య ఉన్న వారికి సొరకాయ చాలా మేలు చేస్తుంది. ఇది తినడం వల్ల దాహాన్ని తగ్గిస్తుంది. 


Also read: రాత్రి భోజనం ఆలస్యంగా తింటున్నారా? అయితే డయాబెటిస్ ముప్పు




















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.