పాల ఉత్పత్తి అయిన పన్నీర్ కు అభిమానులు ఎక్కువ. పన్నీర్ టిక్కా, పనీర్ బిర్యానీ, పనీర్ 65 ఇలా రకరకాల వంటలు దీనితో వండుకోవచ్చు. అలాగే పనీర్ మసాలా, పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్ ఇలా చాలా కర్రీలు కూడా వంటింట్లో రెడీ అవుతాయి. అయితే ఈసారి కొత్తగా పనీరు మెంతికూర కలిపి రోటీలోకి టేస్టీ కర్రీని తయారు చేసుకోండి. దీన్నీ తయారు చేయడం చాలా సులువు. అంతేకాదు వీటిలో పోషకాలు కూడా ఎక్కువ. పిల్లలకూ, పెద్దలకు ఇది శరీరానికి కావలసిన ఎన్నో అత్యవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం.


కావాల్సిన పదార్థాలు
పన్నీర్ - 200 గ్రాములు 
టమోటో - రెండు 
జీలకర్ర - అర స్పూను 
కారం - అర స్పూను 
గరం మసాలా - అర స్పూను 
నూనె - మూడు స్పూన్లు
 మెంతికూర - 500 గ్రాములు 
అల్లం - చిన్న ముక్క 
పసుపు - ఒక స్పూను 
ధనియాల పొడి - ఒక స్పూను 
ఉప్పు - రుచికి సరిపడా


తయారీ ఇలా
1. మెంతికూరను సన్నగా తరుక్కొని, నీటిలో బాగా శుభ్రపరిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పనీర్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత తురిమిన అల్లాన్ని వేసి వేయించాలి.
3.  వాటిలో కారం, పసుపు, ఉప్పు వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి. ఆ నూనెలో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ను వేసి అడుగు అంటుకుండా వేయించుకోవాలి.
4. రెండు మూడు నిమిషాలు పనీర్ వేయించాక ఆ మిశ్రమంలో కోసి పెట్టుకున్న మెంతికూరను వేసి కలపాలి. మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
5. నీరు దిగి ఉడుకుతున్నప్పుడు గరం మసాలా పొడి, ధనియాల పొడి కూడా వేసి కలపాలి. 
6. ఇప్పుడు టమోటాలను సన్నగా తరిగి కూరలో వేయాలి. మూత పెట్టి మగ్గించాలి.
7. టమాటాలు మగ్గాలంటే సమయం పడుతుంది. బాగా మగ్గాక గరిటతో బాగా కలపాలి.
8. అంతే పన్నీర్ మేథి సిద్ధమైపోతుంది. దీన్ని చపాతీతో లేదా పుల్కా తో తింటే ఎంతో రుచి. 


మెంతి ఆకులను రోజువారీ ఆహారంలో వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఒక్క ఆకుకూరతోనే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో ఇవి ముందుంటాయి. ఈ ఆకుల్లో ఐరన్, సెలీనియం, క్యాల్షియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఈ ఆకులు టైప్1, టైప్2 డయాబెటిస్ వంటివి రాకుండా అడ్డుకోవడంలో సహాయపడతాయి. రక్తప్రసరణ శరీరమంతా మెరుగ్గా జరిగేలా చేస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల గుండెకు ఎంతో ఆరోగ్యం. గుండెపోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు, మెంతి ఆకులను వంటలో భాగం చేసుకోవాలి. వీటిలో గెలాక్టోమనన్, పొటాషియం ఉండడం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకునే వారికి కూడా మెంతి ఆకులు మంచే చేస్తాయి. కడుపులో అల్సర్లు రావడం, పేగు మంట పుట్టడం వంటి సమస్యల నుంచి ఇవి కాపాడతాయి. 


Also read: మధుమేహం ఉన్నవాళ్లు తియ్యగా ఉండే పైనాపిల్ తినవచ్చా?