సమయానికి ఆహారం తినడం అనేది ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం. కానీ ఇప్పుడు ఎంతోమంది బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయాల్సిన సమయాల్లో చేయకుండా... నచ్చినప్పుడు తింటున్నారు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్ కన్నా కూడా డిన్నర్ సమయానికి తినడం చాలా ముఖ్యం. రాత్రి ఆలస్యంగా భోజనం చేసేవారికి వచ్చే ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయని వివరిస్తున్నారు వైద్యులు. ఈ విషయంపై ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు కూడా సాగాయి. గతంలో అమెరికాకు చెందిన బ్రిగమ్ ఆసుపత్రి వైద్యులు ఓ పరిశోధన కూడా నిర్వహించారు. అందులో ఎవరైతే రాత్రిపూట సమయానికి ఆహారం తినరో, ఆలస్యంగా తింటారో వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. రాత్రిపూట మేల్కొని, ఆలస్యంగా భోజనం చేసేవారిలో వారి రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటున్నట్టు గుర్తించారు. ఇలా చేసేవారికి టైప్ 2 డయాబెటిస్ త్వరగా వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట భోజనం ఏడు గంటలకు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. 


రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు  ఉన్నాయి. మన మెటబాలిజం ఉదయం నుండి సాయంత్రం వరకు గరిష్ట స్థాయిలో ఉంటుంది. అంటే ఆ సమయంలో ఏం తిన్నా కూడా శరీరం అరిగించుకునే శక్తిని కలిగి ఉంటుంది. సాయంత్రం నుంచి ఆ శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అందుకే రాత్రిపూట భోజనం తేలికపాటిది తినాలని సూచిస్తూ ఉంటారు. అయితే చాలామంది రాత్రిపూట బిర్యానీలు, నాన్ వెజ్, పన్నీర్ కర్రీ ఇలా శక్తివంతమైన ఆహారాన్ని తింటారు. అది కూడా ఎంతోమంది రాత్రి 9 దాటాక తినడానికే ఆసక్తి చూపిస్తారు. ఇలా భారీ భోజనాలు ఆలస్యంగా చేయడం వల్ల శరీరానికి ఎంతో నష్టం. ఇలాంటి భారీ మెనూను లంచ్‌లోనే కానిస్తే మంచిది. 


ఆలస్యంగా భోజనం చేయడం వల్ల శరీరం ఆకలి హార్మోన్ అయినా లెప్టిన్  ఉత్పత్తి చేయకుండా నిరోధిస్తుంది. ఈ ఆకలి హార్మోన్‌ను సమయానికి తన పని తాను చేయకుండా అడ్డుకున్నట్టు అవుతుంది. దీనివల్ల శరీరంపై ప్రభావం పడుతుంది. ఎక్కువగా వేయించిన, అధిక చక్కెర కలిగిన, అధిక కొవ్వు కలిగిన పదార్థాలను తినాలన్న కోరిక పెరిగిపోతుంది. అలాగే ఇన్సులిన్ ఉత్పత్తి కూడా మిగతా శరీర భాగాలు లాగే రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలి. కానీ రాత్రిపూట అధికంగా తినడం వల్ల ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.


అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఎవరైతే సాయంత్రం నాలుగు గంటల తర్వాత భారీ భోజనాలు చేస్తారో, వారు ఎక్కువగా ఆకలితో ఉంటారు. అంతేకాదు వారిలో కొవ్వు పేరుకుపోయే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి మీరు బిర్యాని, పిజ్జా, బర్గర్ వంటి అధిక కేలరీలు, అధిక కొవ్వు ఉండే పదార్థాలను తినాలనుకుంటే ఉదయం పూటనే తినడానికి ప్రయత్నించాలి. 


Also read: మీ మూత్రం రంగు మీకున్న ఆరోగ్య సమస్యల గురించి చెప్పేస్తుంది



















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.