Bike Accident on Aramghar Flyover | హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ఆరాంఘర్ ఫ్లైఓవర్ (Aramghar Flyover)పై ఓ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో... ఈ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. సోమవారం అర్ధరాత్రి రాత్రి ఒంటి గంటకు ప్రమాదం జరిగింది. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.
ఈ మైనర్ బాలురు బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కూటీ ప్రమాదానికి గురైంది. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఈ ఆరాంఘర్ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఈ జనవరి మొదటి వారంలో ప్రారంభించారని తెలిసిందే. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంలో భాగంగా జూ పార్క్ - ఆరాంఘర్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర తెలంగాణ ప్రభుత్వం ఫ్లై ఓవర్ నిర్మించింది.

మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు సూచించారు. పెద్దవారు చేసే చిన్న తప్పిదాలతో పిల్లలు ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. ఆరాంఘర్ ఫ్లై ఓవర్ మీద తాజాగా జరిగిన ప్రమాదమే అందుకు ఉదాహరణ. అతివేగంతో వాహనం నడపటం, హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేయడం అంత సురక్షితం కాదని చెప్పారు.