Road Accident : నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తాగిన మైకంతో నలుగురు యువకులు మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఒకరి మరణానికి కారణమయ్యారు. ఈ ఘటనలో మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. నాంపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కూకట్ పల్లిలోని ఒక హాస్టల్ లో నాగర్ కర్నూల్ కు చెందిన నలుగురు బ్యాచిలర్ యువకులు ఉంటున్నారు.  వారిలో ఒక యువకుడి  పుట్టినరోజు సందర్భంగా ఫుల్ గా మధ్యం సేవించి కాల్ సెంటర్ కు చెందిన కారులో చార్మినార్ కు వెళ్లారు. అక్కడే అతడి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ నిర్వహించారు.  


ఫుల్ గా తాగి ఆటోను ఢీకొట్టి..
అనంతరం మితిమీరిన వేగంతో వాహనం నడిపిస్తూ. ఒక ఆటో ను బలంగా ఢీకొట్టారు. దీంతో ఆటో ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో  ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు కారును ఆపకుండా వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించారు.  అదే సమయంలో అటుగా వెళ్తున్న నెరేడ్ మెట్ కు చెందిన అజయ్ అనే యువకుడు ఆ కారు ను ఆపే ప్రయత్నం చేశాడు.  కానీ వారు కారును ఆపకుండా ఆ యువకుడిని ఢీకొట్టి... అతని పై నుండి వాహనాన్ని పోనిచ్చారు.  దీంతో కారు కింది పడి అజయ్ తీవ్ర రక్త స్రావంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  మద్యం మత్తులో ఒకరి మృతికి  ప్రత్యక్షంగా కారణమై,  ఆటో డ్రైవర్ ప్రాణాపాయ స్థితికి కారణమైన నలుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.  


రెచ్చిపోతున్న మందుబాబులు
ఇటీవల కాలంలో ఈ తరహా దారుణాలు ఎక్కువయ్యాయి. ఫుల్ గా తాగి వాహనాలతో రోడ్ల మీదకు వచ్చి సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారు. పుణె పోర్షే కారు కేసు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే.  ఓ మైనర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారు. పూణేకు చెందిన ఓ రియల్టర్ కుమారుడు పోర్షే టైకాన్ కారును తాగి నడిపి రోడ్డు మీద బైక్ పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను ఢీకొట్టారు. కారు నడిపిన వ్యక్తి వయస్సు 17 సంవత్సరాలు. దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ఇద్దరూ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే అతడికి బెయిల్ మంజూరు అయింది. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నిందితుడు మైనర్ కావడం, పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో అతడిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  ఏదీ ఏమైనా తాగి రోడ్ల మీద వాహనాలు నడిపే వారిని, మైనర్లకు వాహనాలను ఇచ్చే వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ పెరుగుతోంది.