Hyderabad News: హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని శాపూర్ నగర్ లోని ఆదర్శ్ బ్యాంకులో‌ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. శివాజీ అనే 32 ఏళ్ల వ్యక్తి ముఖానికి మాస్క్ తో వచ్చి.. తన వద్ద బాంబ్ ఉందని, రెండు లక్షల రూపాయలు ఇవ్వకపోతే బాంబ్ తో బ్యాంకుని పేలుస్తానంటూ బెదిరించాడు. అతన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురైన బ్యాంక్ సిబ్బంది.. అతడికి తెలియకుండా జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి చాకచక్యంగా బెదిరింపులకు పాల్పడుతున్న శివాజీని పట్టుకున్నారు. అతడి చాతికి ఓ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ పరికరం కట్టి ఉండటం, పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు షాక్ అయ్యారు.


డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కొనడానికి 2 లక్షల రూపాయలు కోసం బ్యాంక్ దొంగతనం చేస్తున్నానంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడడంతో అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని గుర్తించారు. అదే విషయాన్ని జీడిమెట్ల సీఐ పవన్ తెలిపారు. అయితే శివాజీ గతంలో ఎలక్ట్రానిక్ షోరూమ్ లో పని చేశాడని, ఆ అనుభవంతో తినే చెరుకు, టీవీ సర్క్యూట్ తో బాంబు రూపంలో తయారు చేసి సిబ్బందిని బెదిరించిట్లు  పేర్కొన్నారు. నకిలీ బాంబుగా గుర్తించి అతడిపై కేసు నమోదు చేసుకొని‌ దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ పవన్ తెలిపాడు.




గతేడాది నవంబర్ లో చార్మినార్ కు బాంబ్ బెదిరింపు


హైదరాబాద్‌ నగరంలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. పాతబస్తీలో చారిత్రక ప్రదేశమైన చార్మినార్ కు బాంబు బెదిరింపు ఎదురైనట్లుగా.. చార్మినార్ లో పేలుడు పదార్థాలు పెట్టినట్లుగా ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసినట్లుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు వెంటనే బాంబ్‌ స్క్వాడ్‌తో చార్మినార్‌ వద్దకు వెళ్లి సోదాలు చేసినట్లుగా వార్తలు రావడంతో పోలీసులు ఈ గాలి వార్తలను ఖండించారు. అయితే, తాము సాధారణ సోదాల్లో భాగంగానే సోమవారం చార్మినార్ (Charminar Police) పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, పరిసర ప్రాంతాలు, దుకాణాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశామని పోలీసులు తెలిపారు. ఇది గమనించిన కొంత మంది భయపడిపోయి బాంబు కోసమే తనిఖీలు చేస్తున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ మేరకు చార్మినార్ పోలీసులు (Charminar Police) స్పందించారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారం నమ్మవద్దని చార్మినార్ ఎస్సై వెల్లడించారు. బాంబు బెదిరింపు జరిగినట్లుగా పోలీసులకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని స్పష్టత ఇచ్చారు.


నవంబరు 15న పాతబస్తీ ఐ.ఎస్ సదన్ చౌరస్తాలో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు నవంబరు 16న అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్ పీఎస్ (Saidabad Police Station) పరిధిలోని ఐఎస్ సదన్ లో బాంబు ఉందంటూ డయల్ 100 కి అక్బర్ ఖాన్ అనే వ్యక్తి కాల్ చేశాడు. అనంతరం ఐఎస్ సదన్ కు చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేశారు. ఫోన్ లో చెప్పినట్టు అక్కడ ఎలాంటి బాంబు లేదని పోలీసులు చెప్పారు. ఆ ఆగంతుకుణ్ని పట్టుకొనేందుకు పోలీసులు యత్నించి నిందితుడిని పట్టుకున్నారు. అతను ఫోన్ చేసిన నెంబరు ఆధారంగా ఆచూకీని ట్రేస్ చేశారు. నిందితుడిపై సైదాబాద్ పీఎస్ లో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 182, 186, సిటీ యాక్ట్ 70 బీ ప్రకారం పోలీసులు కేసు పెట్టారు.