Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో ఓ మాయా గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. సినిమాలో మాఫియా మాదిరిగా జీపులో మద్యం సేవిస్తూ.. జీపు రెండు వైపులా బైకులపై ప్రాణాంతక విన్యాసాలు చేస్తోంది. మద్యం తాగుతూ బొమ్మ తుపాకీలతో కాల్చి పారేస్తున్నట్లు విలన్లనే మరిపించేలా పాతబస్తీలో అర్థరాత్రి నడి రోడ్డుపై హల్ చల్ చేశారు. సినిమా షూటింగ్ చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేసి లైకులు, షేర్ల కోసం చేస్తున్నారు. స్థానిక ప్రజలను, వాహనదారులను ఒక్కసారి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే.. ఇలా రెచ్చిపోవడం రీల్స్ ట్రెండింగ్ కోసం అంటూ మాయ చేస్తున్నారు.
ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న యువకులు
ముఖ్యంగా సంతోషనగర్, కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరి బీభత్సం ఎక్కువుగా ఉంది. పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలోని సంతోష్ నగర్, కంచన్ బాగ్, చాంద్రాయణ గుట్ట ప్రధాన రహదారులపై మాయా గ్యాంగ్ లీడర్ సయ్యద్సహిల్ ఉద్దీన్ తన అనుచర గణంతో అర్థరాత్రి వేళల్లో జీప్, బైకుపై మద్యం సేవిస్తూ నానా హంగామా సృష్టిస్తున్నాడు. బొమ్మ తుపాకీలతో రోడ్లపై బెదిరిస్తూ స్థానిక ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన వారిని ట్రెండింగ్ కోసం అంట మాయ చేస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. మద్యం సీసాలు, చేతిలో బొమ్మ తుపాకీలతో రెచ్చిపోతూ వాహన దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు..
గతంలో సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే మాయా గ్యాంగ్, సమీర్ గ్యాంగ్ లు గ్రూపులుగా విడిపోయి రోడ్లపై తల్వార్లతో గొడవకు దిగి నానా హంగామా చేశారు. నైట్ డ్యూటీలో ఉన్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య స్వయంగా ఈ రెండు గ్యాంగ్లను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. బెయిల్ పై విడుదలైనప్పటికీ.. వీరి ప్రవర్తనలో మార్పు రాకపోగా రోడ్లపై విచ్చల విడిగా ముంబయి మాఫియా మాదిరి రాజ్యమేలుతున్నారు. అయితే వీరి గురించి తెలుసుకున్న పోలీసులు మరోసారి వీరిని అరెస్ట్ చేశారు.
జాంబియా కత్తులతో హలచల్...
ఈ మధ్యే హైదరాబాద్ లో దారుణం జరిగింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు జాంబియా కత్తులతో హల్ చల్ చేశాడు. సామాజిక కార్యకర్త అమీర్ జైన్ తమ్ముడు అక్బర్ నహీపై.. నవాజ్ నమీ అనే యువకుడు జాంబియా కత్తులతో దాడికి దిగాడు. అనంతరం కత్తులు చేత పట్టుకొని రోడ్లపై తిరుగుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. అయితే ఈ ఘటనలో అక్బర్ నహీకి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు గాయపడిన అక్బర్ నహీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్బర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం నవాజ్ నమీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.