హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపైనే ఘోరం జరిగింది. ఓ మహిళను వ్యక్తి కత్తితో పోట్లు పొడిచాడు. అనంతరం ఆమె చనిపోయిందనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిందితుడు ఆమెకు మాజీ భర్త అని పోలీసులు తెలిపారు. తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై ఇలా కత్తితో దాడి చేసినట్లు చెప్పారు. 


ఎస్ ఆర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళ ఎర్రగడ్డలో నివాసం ఉంటోంది. ఈమెకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తితోనే 2007లో పెళ్లి జరిగింది. దంపతులు ఇద్దరూ జీవనోపాధి కోసం అదే సమయంలో హైదరాబాద్‌కు వచ్చి ఎర్రగడ్డ బి.శంకర్‌లాల్‌ నగర్‌లో అద్దెకు ఉండేవారు. అయితే, ఈ మహిళకు తొలి కాన్పులో కొడుకు రెండోసారి కాన్పులో కూతురు పుట్టారు. రెండోసారి కూతురు పుట్టిందనే సాకుతో 2009లో ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్యామల కొడుకు, కూతురితో కలిసి నగరంలోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటోంది. 


ఈ క్రమంలో 2016లో సుల్తాన్‌ నగర్‌లో ఉండే ఓ సైకిల్‌ మెకానిక్‌ సయ్యద్‌ ఖలీల్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వీరు సహజీవనం కూడా చేశారు. అనంతరం 2017లో బి.శంకర్‌లాల్‌ నగర్‌లో ఉండే చెఫ్‌ శ్రీశైల్‌ కోట్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఈ విషయం ఖలీల్‌కు తెలియడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అందుకోసం ప్రణాళిక ప్రకారం ప్రతి ఆదివారం నిర్వహించే ఎర్రగడ్డ సంతలో మూడు కత్తులను కొనుగోలు చేసి గౌతంపురి కాలనీలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. రోడ్డుపై వెళ్తున్న ఆమెపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.


అనంతరం మహిళ చనిపోయిందని భావించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమయంలో స్థానికులు భయంతో పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం పోలీసులు ఖలీల్‌ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Also Read: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ వాయిదా.... ఈ నెల 18 నుంచి కర్ఫ్యూ అమలు... ఆంక్షల ఉత్తర్వుల్లో సవరణ చేసిన ప్రభుత్వం


Also Read: Covid Updates: తెలంగాణలో కొత్తగా 1920 కరోనా కేసులు, ఇద్దరు మృతి... 16 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి