Hyderabad Crime : ఇన్ స్టా గ్రామ్ లో అమ్మాయిలను ట్రాప్ చేసి అమెరికా నుంచి గిఫ్ట్ లు పంపిస్తున్నట్లు మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్న ఇద్దరు కేటుగాళ్లను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అమెరికాలో ఉంటున్నట్లు  పరిచయం చేసుకుని యువతులను మోసం చేసిన కేసును సీసీఎస్ పోలీసులు ఛేదించారు. బేగంపేటకు చెందిన యువతితో పరిచయం పెంచుతున్న నిందితుడు అమెరికా నుంచి గిఫ్ట్ పంపిస్తున్నట్లు నమ్మించాడు. ఆ గిఫ్ట్ ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం పార్సిల్ టాక్స్ కట్టాలని లేకపోతే రివర్స్ పంపిచేస్తారని నమ్మించారు. ఈ మాటలు నమ్మిన యువతి రూ.2.2 లక్షలు నిందితులకు చెల్లించింది. ఆ తర్వాత మోసపోయానని గుర్తించిన యువతి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది.  


ఫ్రెండ్ రిక్వెస్టులపై బీఅలెర్ట్ 


నైజీరియా, ఘనా దేశాలకు చెందిన ఇద్దరు నిందితులు ఆలోటే పీటర్,రొమాన్స్ జాషువు ఈ నేరానికి పాల్పడ్డినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి సీసీఎస్ సైబర్ పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. స్టూడెంట్ వీసాపై ఇండియాకు వచ్చిన విదేశీయులు ఇన్స్టాగ్రామ్,ఫేస్ బుక్ లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి యువతులకు రిక్వెస్టులు పెట్టి చాట్ చేస్తున్నారు. నగలు,ఫోన్స్, లాప్ టాప్, ఫొటోస్ పంపి నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న కస్టమ్స్ అధికారులు అని చెప్పి ట్యాక్స్ కట్టాలని బెదిరించి యువతుల నుండి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు.  గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 


పిల్లల అశ్లీల చిత్రాలు అప్లోడ్ చేస్తున్న నిందితులపై చర్యలు 


సోషల్ మీడియాలో పిల్లల అశ్లీల చిత్రాలపై ఏపీ సీఐడీ  చర్యలు తీసుకుంది. ఫేస్ బుక్, యూట్యూబ్, జీ మెయిల్ ద్వారా పిల్లల అశ్లీల చిత్రాలను అప్లోడ్ చేస్తున్నట్లు సీఐడీ గుర్తించింది. ఈ కేసులో 12 మంది నిందితులుండగా వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. అశ్లీల చిత్రాలు అప్ లోడ్ చేసిన వారు విజయవాడకు చెంది‌న వ్యక్తులుగా గుర్తించారు. ఏపీ సీఐడీ పంపిన సమాచారంతో విజయవాడ సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు మహిళలు సహా 12 మందిపై కేసు నమోదు చేశారు. 67బీ, ఐటీఏ 2000 - 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. 


ఇన్ స్టాలో రెచ్చిపోతున్న ఝాముడా ముఠా  


ఇన్ స్టాగ్రామ్ లో ఝాముడా(Jhamunda), ఝాముండా అఫీషియల్(jhamunda_official), ఝాముండా అఫీషియల్ 2(jhamunda_official_2) అనే పేరుతో ఓ ముఠా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ మహిళలను కించపరుస్తోంది. ఒక వర్గానికి చెందిన మహిళలనే టార్గెట్ చేస్తూ వారిని ఫోటోలు, వీడియోలు తీసి.. ఆ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ పేజీల్లో పోస్టు చేస్తోంది. అసభ్యకర పదజాలం వాడుతూ ఆ వీడియోపై, ఫోటోలపై కామెంట్లు చేస్తూ వాటిని వైరల్ చేస్తోంది. మీరు మీ స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తుంటే.. ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా అనుసరిస్తున్నట్లు ఊహించుకోండి. మీరు చేసేదంతా షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. వింటుంటే భయమేస్తోందా.. ఝాముండా ఇన్ స్టా పేజీలో జరిగే తతంగం ఇదే. హైదరాబాద్‌లో మోటారు వాహనాల నుంచి మాల్స్ వరకు వివిధ బహిరంగ ప్రదేశాలలో గుర్తు తెలియని వ్యక్తులు.. కొంత మంది యువతీ యువకులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను చిత్రీకరించి మా కమ్యూనిటీ పరువు నాశనం చేస్తున్నారంటూ అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తమకు సంబంధించిన పోస్టులు ఇతర వ్యక్తుల నుంచి వారికి చేరడంతోనే బాధితులకు ఈ ముఠా ఆగడాలు తెలుస్తున్నాయి. కొంత మంది బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ పేజ్ లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని పోలీసులు ఇన్ స్టాగ్రామ్ కు లేఖ రాశారు. అలాగే ఝాముండా పేజ్ పై 506, 509, 354(D) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 


Also Read : PFI Attacks : తెలంగాణలో దాడులకు పీఎఫ్ఐ కుట్ర, హిందూ ధార్మిక సంస్థలే టార్గెట్!