PFI Attacks : నిషేధిత పీఎఫ్ఐ(Popular Front Of India) కార్యకర్తలు తెలంగాణలో దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేరళ, తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పీఎఫ్‌ఐ ప్లాన్ చేసిందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై నిఘా పెట్టాలని పోలీసులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఆర్‌ఎస్‌ఎస్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులను పోలీసులు అలర్ట్ చేశారు. పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు చట్టవిరుద్ధమైన సంస్థలని కేంద్రం వాటిపై నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద పీఎఫ్ఐపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. తాజాగా ఇంటెలిజెన్స్ అధికారులు పీఎఫ్ఐ కదలికలపై నిఘా పెట్టాలని పోలీసులకు సూచించింది. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చారు. కేరళ, తమిళనాడులో నిషేధిత పీఎఫ్ఐ కుట్రలను అక్కడి పోలీసులు భగ్నం చేశారు.
దేశవ్యాప్తంగా సోదాలు
పీఎఫ్ఐ కార్యకర్తలు, అనుబంధ సంస్థలపై నిఘా పెట్టాలని రాష్ట్ర పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం అందించారు. శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా పోలీస్ అధికారులు నిఘా పెట్టాలని సూచించారు. దీంతో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, హిందు ధార్మిక సంస్థల ప్రతినిధులను పోలీసులు అలర్ట్ చేశారు. సెప్టెంబర్ నెలలో పీఎఫ్ఐ కార్యాలయాలు, అనుబంధ సంస్థలపై ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. పలువురు పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ క్రమంలో హైదారాబాద్ పాతబస్తీలో ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాన్ని ఎన్ఐఏ అధికారులు సీజ్ చేశారు. పీఎఫ్ఐ విదేశాల నుంచి నిధులు సేకరిస్తూ మతపరమై వివాదాలు సృష్టించేందుకు ఆ నిధులను వినియోగిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా పలువురు పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు కీలక సమాచారం రాబట్టింది. పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.
ఐదేళ్ల నిషేధం
ఐదేళ్ల పాటు పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాలపై చట్టవిరుద్ద నిరోధక చట్టం ప్రకారం కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిషేధాన్ని మరింత పొడిగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పీఎఫ్‌ఐ సంస్థ నిషేధంపై ఆ సంస్థ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, నిషేధం విధించడం దారుణమని పలు రాష్ట్రాల్లో ధర్నాలు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించడం, అల్లర్లను రెచ్చగొట్టడం, భయాందోళనలు సృష్టించడం, ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో యూపీలోని ముఖ్యమైన, సున్నితమైన ప్రదేశాలు, వ్యక్తులపై ఏకకాలంలో దాడులకు పీఎఫ్ఐ కుట్ర చేసిందని కేంద్రం తెలిపింది.
Also Read : మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో రాజగోపాల్‌రెడ్డికి షాక్ ఇచ్చిన గ్రామస్థులు