Hyderabad News: హైదరాబాద్ లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. కేవలం నేరాలే కాదు, నేరగాళ్ల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. అమాయక ప్రజల పేరిట దొంగ రుణాలు తీసుకొని కొందరు, క్రెడిట్ కస్టమర్ కేర్ పేరుతో మరికొంత మంది మోసాలకు పాల్పడిన వారు. ఇలా రకరకాల పేర్లతో మోసాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్న 15 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి అమాయకుల పేరిట రూ.4.38 కోట్ల రుణాలు తీసుకున్న 10 మందిని తొలుత పోలీసులు అదుపులోకి తీసున్నారు. వీరంతా నకిలీ కంపెనీల పేరుతో ఉద్యోగాలు ఇచ్చి, వారి డాక్యుమెంట్లతో వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రుణాలు వచ్చిన తర్వాత వారిని ఉద్యోగాల నుంచి తీసేసి మళ్లీ కొత్త వాళ్లని రిక్రూట్ చేసుకున్నట్లు తేలింది. అలా కొత్తగా వచ్చిన వాళ్ల పేరిట మళ్లీ రుణాలు పొందడం షరా మామూలు. అయితే బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు.


క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ పేరుతో మోసాలు, ఐదుగురి అరెస్ట్!


ఎస్బీఐ క్రెడిక్ కార్డు కేర్ నంబర్ కోసం ఓ వ్యక్తి గూగుల్ లో వెతికాడు. ఈ క్రమంలోనే నకిలీ నంబర్ ను గుర్తించలేక దానికి ఫోన్ చేశాడు. కస్టమర్ కేర్ సిబ్బందిగా బాధితుడిని నమ్మించిన మోసగాళ్లు అతని మొబైల్ లో గుర్తించలేక దానికి ఫోన్ చేశాడు. కస్టమర్ కేర్ సిబ్బందిగా బధితుడిని నమ్మించిన మోసగాళ్లు అతని మొబైల్ లో ఎనీడెస్క్ యాప్ ను డౌన్ లోడ్ చేయించారు. అనంతరం బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.16 వేలు కాజేశారు. నష్టపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా దిల్లీకి వెళ్లి నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా నిందితులపై కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ ముఠాగా ఏర్పడి నిందితులు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. 


తక్కువ వడ్డీకే రుణాల పేరిట మరో మోసం 


ఇటీవలే కామారెడ్డి జిల్లాలో అమాయక, గ్రామీణ, నిరక్షరాస్యులైన ప్రజలకు తక్కువ వడ్డీకి మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు లోన్లు ఇప్పిస్తామంటూ.. దంపతులు బురిడీ కొట్టించారు. బాధితుల కథనం ప్రకారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన శ్రీహరి, రాణి అనే దంపతులు GDFC నిధి లిమిటెడ్ (పేదల పాలిట పెన్నిధి) అనే సంస్థ నుంచి తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తామంటూ గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి, బీబీపేట తదితర మండలాలకు చెందిన  సుమారు 250 మంది అమాయక ప్రజల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ. 10 వేల నుంచి రూ.15 వేల వరకు జీఎస్టీ, టాక్సీ, వివిధ పన్నుల రూపంలో సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు.

 

దీంతో బాధితులు గత కొద్ది రోజుల నుంచి శ్రీహరి -రాణి కి ఫోన్లు చేశారు. ఫోన్ లో పొంతన లేని సమాధానం చెబుతూ.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సమాధానం చెప్పారు. గత రెండు రోజుల నుంచి ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు శ్రీహరి స్వగ్రామమైన చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ... తమకు అతి తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తానంటూ దంపతులు నమ్మబలకడంతో వారి మాటలు నమ్మి ఒక్కొక్కరు రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు తమ వద్ద నుంచి వివిధ ట్యాక్సీ రూపంలో వసూలు చేసుకుని సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేసి తమను మోసం చేశారంటూ వాపోతున్నారు బాధితులు. పోలీసులను ఆశ్రయించి తమ డబ్బులు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీహరి, వాణిల కోసం వెతుకుతున్నారు.  అయితే సైబర్ మోసానికి గురైన వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు.