Anti-Human Trafficking Gang Arrested: Cyberabad CP Raveendra: యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్ ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠాకు చెందిన 17 మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 1419 మంది బాధిత అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించామని, వారికి విముక్తి కల్పించినట్లు సమాచారం. మొత్తం 15 నగరాల నుంచి యువతుల్ని రప్పించిన నిందితులు వెబ్ సైట్, వాట్సప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సప్లై చేస్తన్నారని పోలీసులు గుర్తించారు. 39 కేసుల్లో నిందితులు ప్రమేయం ఉన్నట్లు తేలిందని, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు విదేశీ మహిళలతో వ్యభిచారం నడుపుతున్నారని సైబరాబాద్ సీపీ వెల్లడించారు. డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ సెక్స్ రాకెట్‌లో కస్టమర్లకు యువతులు, మహిళల్ని తరలిస్తున్నారని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఐదు కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.
ప్లాన్ ప్రకారం యువతులు, మహిళల్ని వ్యభిచారంలోకి దింపడంతో పాటు కొన్ని సందర్భాలలో డ్రగ్స్ అందిస్తూ ఈ దందా నిర్వహిస్తున్నారు. నిందితులు సప్లయర్స్, బ్రోకర్లు ద్వారా భాదితులను కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అమ్మాయిలను విమానాల్లో కూడా వేరే రాష్ట్రాలకి కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రలోని ముంబై, పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తాకి చెందిన వారు భాదితులు ఉన్నారని గుర్తించినట్లు చెప్పారు. బంగ్లాదేశ్, నేపాల్, రష్యాకి చెందిన అమ్మాయిలతో కూడా ఈ దందా చేస్తున్నారు. వ్యభిచారం ద్వారా వచ్చిననగదులో 30 శాతం బాధిత అమ్మాయిలకు చెల్లిస్తున్నారని, మరో 35 శాతం వెబ్ సైట్ యాడ్స్‌కు, మిగిలిన 35 శాతం నగదును నిర్వాహకులు తీసుకుంటున్నారని చెప్పారు.
ఆర్నావ్ అనే వ్యక్తి హ్యూమన్ ట్రాఫికింగ్ లో కీలక నిందితుడని తెలిపారు. 915 మంది అమ్మాయిలని ముంబై, కోల్ కత్తా నుండి సప్లై చేసినట్లు గుర్తించారు. 2019 నుండి సమీర్ అనే వ్యక్తి 850 మంది అమ్మాయిలను సప్లై చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అనంతపూర్, కరీంనగర్, హైదరాబాద్ కేంద్రాలుగా సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. 950 మంది అమ్మాయిలతో హైదరాబాద్ లో ఆర్నావ్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్, వ్యభిచార దందా చేస్తున్నాడని కేసు వివరాలు వెల్లడించారు.
సోమాజిగూడలో ఆర్నావ్ ను ఓ ఫ్లాట్ లో అరెస్టు చేసి, అదే ఇంట్లోనే MDMA డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు సైబరాబాద్ సీపీ తెలిపారు. జాబ్ లేని అమ్మాయిలను, పేదరికంలో ఉన్న అమ్మాయిలను జాబ్స్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని, ఈ సెక్స్ రాకెట్ వివిధ గ్రూప్ లుగా విడిపోయి ఈ దందా చేస్తూ యువతుల్ని ఈ వ్యభిచార కూపంలోకి లాగుతున్నారని చెప్పారు. కొన్ని హోటల్స్‌లో పనిచేసే వారి ప్రమేయం ఉందని, వారిని కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి కేసు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.