FIFA WC 2022 Qatar: క్రొయేషియా నిలిచింది. చిన్న జట్టు జపాన్ పై విజయం సాధించి క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. చిత్తు చేసే ఒత్తిడిని అధిగమించి, తన అత్యుత్తమ ఆటతో గెలిచింది. చిన్న జట్టైనా జపాన్ పోరాటం ఆకట్టుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ప్రీక్వార్టర్స్ లో పెనాల్టీ షూటౌట్లో క్రొయేషియా విజయం సాధించింది. జపాన్ జట్టు 3 పెనాల్టీలను అడ్డుకున్న క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్ హీరోగా నిలిచాడు.
తొలి గోల్ జపాన్ దే
ఈ మ్యాచ్‌లో మొదట గోల్ ప్రయత్నాలు క్రొయేషియా చేసినా.. గోల్ కొట్టింది మాత్రం జపానే. క్రొయేషియా ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ తొలి 30 నిమిషాల్లోనే 2 గోల్ అవకాశాలను సాధించారు. అయితే గోల్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యారు. 8వ నిమిషం, 28వ నిమిషంలో ఇవాన్ పెర్సీచ్ గోల్ అవకాశాలను సృష్టించుకున్నా గోల్ చేయలేకపోయాడు. అయితే ఆ తర్వాత నుంచి జపాన్ ఆటగాళ్లు నెమ్మదిగా దాడులకు దిగారు. క్రొయేషియాను కాచుకుంటూనే బంతిని నియంత్రణలోకి తెచ్చుకున్న ఆ జట్టు వ్యూహాత్మక పాస్‌లతో ప్రత్యర్థి గోల్ ప్రాంతంలోకి పదే పదే ప్రవేశించింది. 41వ నిమిషంలో కమాడా కొట్టిన ఓ షాట్ క్రొయేషియా గోల్‌బార్ పైనుంచి వెళ్లిపోయింది. ఆ కాసేటికే జపాన్ శ్రమ ఫలించింది. ప్రత్యర్థికి షాక్ ఇస్తూ ప్రథమార్థం ఆఖర్లో డైజన్ (43వ) జపాన్ ఖాతా తెరిచాడు.
క్రొయేషియా గోల్
రెండో అర్ధ భాగంలో క్రొయేషియా దూకుడుగా ఆడింది. వారి ప్రయత్నాలకు త్వరగా ఫలితం వచ్చింది. తన మూడో ప్రయత్నంలో పెర్సీచ్ (55వ) సఫలమయ్యాడు. సహచరుడి నుంచి ఓ ఫ్రీకిక్‌ను అందుకున్న అతడు హెడర్‌తో బంతిని నెట్‌లోకి పంపేశాడు. స్కోరు 1-1గా నిలవడం, నిర్ణీత సమయంలో మరో గోల్ పడకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి మళ్లింది.
షూటౌట్ క్రొయేషియాదే
అదనపు సమయంలో జపాన్ గోల్ చేసినంత పని చేసింది. మైదానం మధ్యలో బంతిని దొరకబుచ్చుకున్న మిటోమా 105వ నిమిషంలో ఒక్కో డిఫెండర్‌ను తప్పిస్తూ ఓ శక్తిమంతమైన షాట్ కొట్టాడు. కానీ దీన్ని క్రొయేషియా కీపర్ లివకోవిచ్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే జపాన్ ఆటగాళ్లు మరోసారి షాట్ కొట్టినా కీపర్ వారి ప్రయత్నాలకు అడ్డుపడ్డాడు. ఆ తర్వాత జపాన్ మరో విఫలయత్నం చేసింది. అదనపు సమయంలోనూ గోల్స్ కాకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది. షూటౌట్లో తన తొలి 2ప్రయత్నాల్లో జపాన్ (మినామినో, మిటోమా) విఫలం కాగా.. క్రొయేషియా (వ్లాసిచ్, బ్రొజోవిచ్) సఫలమైంది. క్రొయేషియా గోల్‌కీపర్ లివకోవిచ్ జపాన్ తొలి 2 పెనాల్టీను అడ్డుకున్నాడు. క్రొయేషియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో షాట్‌కు జపాన్ (తకూమా) గోల్ చేయగా.. క్రొయేషియా విఫలం (మార్కో) కావడంతో స్కోరు 1-2తో ఆసక్తికరంగా మారింది. కానీ నాలుగో ప్రయత్నంలో యొషిదా (జపాన్) విఫలం కాగా.. పెర్సీచ్ (క్రొయేషియా) గోల్ చేయడంతో క్రొయేషియా సంబరాల్లో మునిగిపోయింది.