టాలీవుడ్ లో చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న హీరోల్లో మంచు విష్ణు ఒకరు. కెరీర్ బిగినింగ్ లో మంచి హిట్స్ తో ఫామ్ లోకి వచ్చినా గత కొన్నేళ్లుగా ఒక్క బ్లాక్ బస్టర్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు. ఇటీవల ఆయన నటించిన ‘జిన్నా’ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విష్ణుకు మళ్లీ చుక్కుదురైంది. అయితే ఈ సినిమాను డిసెంబర్ 2న ఓటీటీలో విడుదల చేశారు. అమేజాన్ ప్రైమ్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. ఈ మూవీకి డిజిటల్ వేదికలో అనూహ్య స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా అమేజాన్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అమేజాన్ ప్రైమ్ లో విడుదలైన సినిమాల్లో 7వ స్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 


ఈషాన్ సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఒక హారర్ రొమాంటిక్ కామెడీ మూవీ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా చూసిన వారు బానే ఉందని చెప్పినా ఎందుకో కలెక్షన్ల విషయంలో సత్తా చాటలేకపోయింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్ లో విడుదలైనా ఒక్క చోట కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా ఎక్కువగానే జరిగాయి. అయితే ఇప్పుడు ఓటీటీ వేదికపై ఈ మూవీకు మంచి గుర్తింపు రావడం విశేషం. 


ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. ఓటీటీల్లో వస్తోన్న కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా సమయంలో ఓటీటీలు బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత సినిమాలను డిజిటల్ వేదికగా విడుదల చేస్తున్నారు. ఇంకొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ లలో విడుదల అవుతున్నాయి. అయితే థియేటర్లు, ఓటీటీ ల విషయంలో ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయని చెప్పొచ్చు. థియేటర్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొన్ని సినిమాలు ఓటీటీలో అంతగా ఆకట్టుకోవడం లేదు. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు ‘జిన్నా’ సినిమా కూడా అంతే. ఈ సినిమా ఓటీటీ విడుదల అంటే ఎవ్వరూ చూడరులే అనుకున్నారు. కానీ డిజిటల్ వేదికపై ఇప్పుడు ‘జిన్నా’ సినిమా ట్రెండింగ్ లో టాప్ లో నడుస్తోంది. దీంతో ఈ సినిమాపై మళ్లీ ఇప్పుడు చర్చలు మొదలైయ్యాయి. 


ఇక ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి కథ అందించారు. అవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, యూనివర్సల్ స్టూడియోస్ కలసి సంయుక్తంగా నిర్మించారు. రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. స్పెషల్ పాత్రలో సన్నీ లియోన్ కనిపించింది. అలాగే వెన్నెల కిషోర్, సునీల్, సురేష్, అన్నపూర్ణ, దివి, నరేష్, రఘుబాబు, సత్యం రాజేష్, చమ్మక్ చంద్ర తదితరులు ఈ మూవీలో నటించారు.



Read Also: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?