కన్న బిడ్డ బరువై అమ్మకానికి తెగబడ్డారు ఈ మానవత్వం లేని తల్లిదండ్రులు. మూడో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టిందని పసికందును వదిలించుకొనేందుకు సిద్ధపడ్డారు. 15 రోజుల పసి కందును రూ.80 వేలకు అమ్మారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్  పరిధిలో ఈ ఘటన జరిగ్గా.. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ పసికందు అమ్మమ్మ ఫిర్యాదు చేయగా.. విషయం బయటకు పొక్కింది. అయితే, ఈ వ్యవహారంలో ఓ ఆశా వర్కర్‌ కీలక పాత్ర కూడా ఉంది. 


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలోని కమలా నగర్‌లో దంపతులు దుర్గప్రియ, శ్రీనివాస్‌ ఉంటున్నారు. శ్రీనివాస్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.  వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గత నెల 21న దుర్గప్రియ గాంధీ ఆసుపత్రిలో మూడో కాన్పులో ఆడశిశువును ప్రసవించింది. మూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు. దీంతో వారిని ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన దుర్గప్రియ తల్లి రాజేశ్వరి వారిని ఇంటి వద్ద దిగబెట్టి తన స్వగ్రామైన కర్నూల్‌ జిల్లా ఆలూరుకు వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన పసికందు క్షేమ సమాచారం కోసం ఫోన్ చేయగా.. కూతురు, అల్లుడు ఫోన్ ఎత్తడం లేదు. దీంతో కంగారుపడ్డ ఆమె ఈ నెల 6న ఆమె తిరిగి వనస్థలిపురానికి చేరుకుంది. ఇంట్లో ఆడ శిశువు కనిపించకపోవడంతో వారిని నిలదీసింది. పాపను ఎవరో కిడ్నాప్‌ చేశారని చెప్పగా.. నమ్మశక్యంగా లేకపోవడంతో రాజేశ్వరి వారిపై అనుమాన పడింది. కూతురు, అల్లుడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వెంటనే వెళ్లి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


Also Read: Medaram Prasadam: గుడ్‌న్యూస్.. మేడారం వెళ్లకుండానే ప్రసాదం డోర్ డెలివరీ, ఎలా పొందొచ్చంటే..


మరోవైపు, బాలానగర్‌లో నివాసం ఉంటున్న కవిత అనే మహిళ సోదరి ధనమ్మకు సంతానం లేదు. కవిత నవజాత శిశువు కోసం స్థానిక ఆశా కార్యకర్త బాషమ్మను సంప్రదించింది. ఆమె ఈ విషయాన్ని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దుర్గప్రియ దంపతులకు చెప్పింది. డబ్బు కోసం ఆశ పడిన ఆ దంపతులు రూ.80 వేలకు శిశువును అమ్మేందుకు సిద్ధపడ్డారు. ఆ ప్రకారమే.. డబ్బుకు శిశువును వారికి ఇచ్చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. తమకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, మళ్లీ అమ్మాయే పుట్టడంతో అమ్మామని నిందితులు తమ పనిని సమర్ధించుకున్నారు. దీంతో నిందితులు దుర్గప్రియ, శ్రీనివాస్‌తో పాటు ధనమ్మ, ఆశా వర్కర్ బాషమ్మపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. శిశువును ఛైల్డ్‌లైన్‌ సంస్థకు అప్పగించారు.