Hyderabad Bank Theft Case: హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి క్యాషియర్ రూ.22 లక్షలు ఎత్తుకెళ్లిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్యాషియర్ ప్రవీణ్ ఎట్టకేలకు నేరుగా హయత్ నగర్ కోర్టుకు వెళ్లి లొంగిపోయాడు (Bank Of Baroda Cashier Praveen Suerrendered in Court). వారం రోజుల క్రితం రూ.22 లక్షలతో ప్రవీణ్ ఉడాయించగా.. గత వారం రోజులుగా పోలీసులు క్యాషియర్ ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న సమయంలో క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తూ పోలీసులను, బ్యాంక్ వారిని తప్పుదోవ పట్టించాడు.


మొదటి సెల్ఫీ వీడియోలో తాను అమాయకుడినని, గత రెండు మూడు నెలలుగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు లెక్కలు సరిగా లేవని ఆరోపించాడు. నగదు మాయం కావడంపై బ్యాంక్ అధికారులపై ఆరోపణలు చేశాడు నిందితుడు ప్రవీణ్. బ్యాంకులో మాయమైన నగదు తానే తీసుకెళ్లానని, క్రికెట్ బెట్టింగ్ లో పెట్టి నష్టపోయానని రెండో సెల్ఫీ వీడియోలో అసలు విషయాన్ని బయటపెట్టాడు క్యాషియర్ ప్రవీణ్. మళ్లీ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి, నగదు గెలుచుకుంటే బ్యాంకు నుంచి తీసుకెళ్లిన మొత్తాన్ని  తిరిగి ఇచ్చేస్తానంటూ బ్యాంక్ మేనేజర్ కు  మెసేజ్ చేయడం తెలిసిందే. వారణాసిలో ఉన్నానంటూ పోలీసులను తప్పుదోవ పట్టించాడు. ఇన్‌స్టా చాట్ ఆధారంగా ప్రవీణ్‌ గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 


అసలేం జరిగిందంటే.. 
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్​ బరోడాలో ఈ క్యాషియర్ చేసిన పనికి ఉద్యోగులతో పాటు అంతా షాక్ అయ్యారు. వనస్థలిపురంలోని బ్రాంచ్‌లో రూ. 22.53 లక్షల నగదు మాయం అవ్వడంతో అధికారులు ఎవరు చేశారనే కోణంలో తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో క్యాషియర్ ప్రవీణ్‌ ​​పై అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. క్యాషియర్​ ప్రవీణ్​ ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు నిర్దారించారు. మంగళవారం మధ్యాహ్నం రూ.22.53 లక్షలు డబ్బు తీసుకుని పారిపోయినట్లు పోలీసులు అధికారులకు తెలిపారు.


బెట్టింగ్‌లో వస్తే ఓకే.. లేకపోతే డౌటే!
తాను క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు మొత్తం కోల్పోయానని, అయితే వాటిని రాబట్టేందుకు బ్యాంక్ నుంచి మరింత నగదు తీసుకెళ్లానని, ఈసారి బెట్టింగ్‌లో డబ్బులు వస్తే బ్యాంకుకు కట్టేస్తానని క్యాషియర్ ప్రవీణ్ ఇదివరకే పేర్కొన్నాడు. ఒకవేళ తనకు డబ్బులు తిరిగి రాకపోతే సూసైడ్ చేసుకునే ఛాన్స్ ఉందని సైతం చెబుతూ ట్విస్ట్ ఇచ్చాడు. వారణాసిలో ఉన్నానని పోలీసుకు చెప్పి తప్పుదోవ పట్టించిన ప్రవీణ్ గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్లు గుర్తించారు. నేడు హయత్ నగర్ కోర్టుకు వచ్చి నేరుగా లొంగిపోయి బ్యాంకు సిబ్బందికి, పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు క్యాషియర్.


Also Read: Bank Theft Case: బ్యాంకు దొంగతనం కేసులో ట్విస్టులపై ట్విస్టులు! నిందితుడి నుంచి మరో సెల్ఫీ వీడియో 


Also Read: Vanasthalipuram Theft: వనస్థలిపురం బ్యాంకు చోరీ కేసులో ట్విస్ట్! వెంటనే మరో మలుపు