Child Marriage : తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలు ముసుగులో 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో బాల్య వివాహం చేశారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో ఈ ఘటన జరిగింది. బాలిక తల్లిదండ్రులే ఈ దారుణానికి పాల్పడ్డారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు నమ్మించి బాలికకు వివాహం చేశారు. దీంతో బాలిక ఈ విషయాన్ని ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. తనకు పెళ్లి ఇష్టం లేదని బంధువుల ఇంటికి వెళ్లింది. బాలిక ఎక్కడుందో తెలుసుకుని అక్కడకు వచ్చిన తల్లిదండ్రులు బంధువులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బాలిక బంధువుల ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఐసీడీఎస్‌ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


రోజుకి సగటున మూడు చొప్పున 


తెలంగాణలో బాల్య వివాహాలకు అడ్డుకట్టపడటం లేదు. ప్రభుత్వం, అధికారులు ఎన్ని కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నా బాల్య వివాహాలు ఆగడంలేదు. బాలికల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసినా, కల్యాణలక్ష్మి ఇస్తున్నా కొన్ని చోట్ల గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. కరోనాతో ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసి, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. రాష్ట్రంలో రోజుకి సగటున మూడు చొప్పున రెండేళ్ల వ్యవధిలో 2,399 బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతుంది. అయినా రాష్ట్రంలో 18 ఏళ్లలోపు వారికి బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి.


చట్టం పూర్తి స్థాయిలో అమలు అవుతుందా?  


రాష్ట్రంలో బాల్యవివాహాల నిరోధక చట్టం-2006 పూర్తిస్థాయిలో అమలు కావడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. బాల్యవివాహాలను అడ్డుకునేందుకు చైల్డ్‌లైన్‌ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ యూనిట్లు, బాలల సంరక్షణ కమిటీలకు క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి బాధ్యుడిగా ఉంటారు. జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో బాల్య వివాహాల నిరోధక కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ బాల్య వివాహాలకు అడ్డుకట్టపడడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచి, గ్రామ కార్యదర్శి, అంగన్‌వాడీ సిబ్బంది కుటుంబ సభ్యులు దాడికి పాల్పడతారన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. బాల్య వివాహాలపై అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా లేదా మహిళా సహాయ కేంద్రం 181, పోలీసు హెల్ప్‌లైన్‌ నంబరు 100 ద్వారా ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారు. 


Also Read : Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్‌లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!