Hostel Warden Gets Death Penalty In Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) కొన్నేళ్ల క్రితం వెలుగుచూసిన అత్యాచార కేసులో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం (Pocso Special Court) గురువారం కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 21 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడిన హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ ప్రధానోపాధ్యాయుడితో సహా మరో టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో టీచర్, హాస్టల్ వార్డెన్‌కు పరిచయం ఉన్న వ్యక్తిని నిర్దోషులుగా విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో 2022లో ఈ లైంగిక దాడుల వ్యవహారం వెలుగుచూసింది. హాస్టల్ వార్డెన్ తన 12 ఏళ్ల కవల కుమార్తెలను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ తండ్రి ఫిర్యాదు చేయగా.. మరికొందరు బాధితులు సైతం ఇవే ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణలో వార్డెన్ అరాచకలు వెలుగుచూశాయి. 2014 - 2022 వరకూ ఆ స్కూల్‌లో హాస్టల్ వార్డెన్‌గా పని చేసిన సమయంలో 21 మంది మైనర్లపై నిందితుడు లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినట్లు వెల్లడైంది. బాధితుల్లో ఆరుగురు బాలురు సైతం ఉన్నట్లు తేలింది.


మత్తు మందు ఇచ్చి దారుణం


ఈ కేసుకు సంబంధించి గతేడాది జులైలో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు లైంగిక దాడికి పాల్పడే ముందు బాధితులకు మత్తు మందు ఇచ్చేవాడని తేలింది. ఈ విషయాలు బయటకు చెప్పకూడదని బాధితులపై బెదిరింపులకు సైతం పాల్పడేవాడు. ఈ క్రమంలో అతని వేధింపులు భరించలేక ఆరుగురు బాధితులు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వార్డెన్ అరాచకాల పట్ల ఓ మహిళా టీచర్‌కు బాధిత చిన్నారులు తెలిపినా.. ఆమె పై అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని దర్యాప్తులో తేలింది. పూర్తిస్థాయి విచారణ జరిపిన పోక్సో న్యాయస్థానం నిందితుడైన వార్డెన్‌కు మరణ శిక్ష, మాజీ ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో మహిళా టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.


Also Read: Putin : అమెరికా, యూకేపై అణు బాంబులు ఖాయం - పుతిన్ హెచ్చరికతో కలకలం - రష్యాలో ఏం జరుగుతోంది ?