Putin reveals new rules on nuclear weapons : రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత భయానకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రిటన్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఉక్రెయిన్‌కు అత్యాధునిక క్షిపణులను సరఫరా చేయాలని నిర్ణయించింది. రష్యాపై దాడి కోసం అత్యాధునిక.. ఆణుబాంబును మోసుకెళ్లే ‘స్టార్మ్ షాడో’ క్రూయిజ్ క్షిపణిని ఉక్రెయిన్ కు ఇవ్వాలని యూకే నిర్ణయించింది. అలాగే .. రష్యా విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించందుకు బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ అమెరికా వెళ్లారు. ఈ పరిణామాలపై అప్రమత్తమైన రష్యా పశ్చిమ దేశాలకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
తమపై దాడులు చేసే దేశానికి సాయం చేసే దేశాలు కూడా తమపై దాడి చేసినట్లుగానే భావించి వాటిపై కూడా అణుదాడికి పాల్పడేందుకు వెనుకాడకూడదని.. వ్లాదిమిర్ పుతిన్ తమ దేశ అణ్వస్త్ర పాలసీని మార్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. రష్యా తన అణు ముసాయిదాలో వెంటనే మార్పులు చేసుకుంది. నాటో దేశాల్లోని ఏ ఒక్క దేశం నుంచి ఉక్రెయిన్ కు ఆయుధాలు వచ్చినా.. ఆ ఆయుధాలతో రష్యాలపై దాడి జరిగితే.. నాటో దాడి చేసినట్లుగానే భావిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. ఆ మేరకు అందరిపై అణుబాంబులు వేస్తామన్నారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య సుదీర్ఘ కాలంగా సాగుతున్న యుద్ధం ముగింపునకు రావడం లేదు. రాష్ట్ర అడపాదడపా దాడులు చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ వైపు నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య శాంతిని ఎవరూ నెలకొల్పలేకపోయారు. వ్లాదిమిర్ పుతిన్ శాంతి చర్చలకు కూడా సిద్ధంగా లేరు. అదే సమయంలో.. ఎవరు ఉక్రెయిన్ కు సహకరించినా రష్యా తీవ్రంగా స్పందిస్తోంది. సైనిక సాయం .. ఆయుధ సాయం చేస్తే ఆయా దేశాలు కూడా తమకు శత్రువులేనని వారిపై అణుదాడులు చేస్తామని తాజాగా హెచ్చరించడం సంచలనం అవుతోంది.
నిజానికి బ్రిటన్, అమెరికాలతో రష్యాకు సత్సంబంధాల్లేవు. కానీ ఆయా దేశాల మధ్య అణుబాంబులు వేసుకోవాల్సినంత శుత్రు వాతావరణం గతంలో ఏర్పడలేదు. కానీ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత ఆయా దేశాల నుంచి ఉక్రెయిన్ కు సాయం అందుతోంది. కొన్ని ఆయుధాలతో పాటు మానవతా సాయం కూడా పంపిస్తున్నారు. ఇప్పుడు భారీ ఆయుధాలు కూడా పంపేందుకు సిద్ధం కావడం.. పుతిన్ ను ఆగ్రహానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. అణుబాంబుల దాడి జరిగితే ప్రపంచం వినాశనం వైపు దారి తీస్తుంది. పుతిన్ హెచ్చరికల్ని ఆషామాషీగా తీసుకోలేమని.... అమెరికా, యూకే.. రెచ్చగొట్టే ధరోణితో కాకుండా.. ఆ సమస్యను ఉక్రెయిన్, రష్యాలే పరిష్కరించుకునేలా చూడాలన్న విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.