Guntur News : గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం పెద్ద ఎత్తున సీక్రెట్ గా రవాణా అవుతోంది. దీనిపై నిఘాపెట్టిన అధికారులు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి సిద్ధమయ్యారు. పక్క రాష్ట్రాలకు నుంచి గుంటూరు జిల్లాలో‌కి వచ్చిన మద్యాన్ని ధ్వంసం చేశారు. వివిధ సందర్భాలలో పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను ఇవాళ గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. మొత్తం రూ. 9 లక్షల విలువ గల అక్రమ మద్యం ధ్వంసం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం తీసుకువస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. కేసులు పెట్టి  జైలుకు పంపడంతో పాటు వారిపై పీడీ యాక్ట్  అమలు చేస్తామని హెచ్చరించారు.







కోరంగి అభయారణ్యంలో సారా ఏరులు


కాకినాడ జిల్లా కోరంగి అభయారణ్యంలో నాటుసారా ఏరులై పారుతోంది. నెల రోజులుగా ముప్పుతిప్పలు పెడుతున్న రాయల్ బెంగాల్ టైగర్ జాడ వెతికే పనిలో నిమగ్నమైన అధికారులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న మిగిలిన అటవీ ప్రాంతానికి వెళ్లే తీరిక దొరకని పరిస్థితి ఎదురైంది. ఇదే అదనుగా కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే కోరంగి అభయారణ్యంలో కేటుగాళ్లు ఏకంగా నాటుసారా బట్టీలనే పెట్టేశారు. కోరంగి బీట్ ఏరియాలో సాధారణ పెట్రోలింగ్ కు వెళ్లిన ఫారెస్ట్ అధికారులకు ఏకంగా 18,600 లీటర్లు బెల్లం ఊట కంటపడింది. ఈ సరుకంతా 93 పీపాలలో నింపి ఉంచారు. దీని విలువ సుమారు 4 లక్షల రూపాయలకు పైబడి ఉంటుందని, ఇది సారాగా తయారు చేస్తే 15 లక్షల రూపాయలు విలువ చేస్తుందని కోరంగి వైల్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరప్రసాద్ తెలిపారు. 


బట్టీలు ధ్వంసం 


మూడు ప్రాంతాల్లో ఈ బెల్లం ఊటను పెద్ద పెద్ద టిన్నుల్లో నిల్వ ఉంచారని, వీటిని ఎక్కువగా సావిత్రి నగర్, మిరియాంపేట, తదితర పాంతాలకు చెందిన వారు ఫారెస్ట్ ఏరియాల్లో బట్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి దాడులు చేస్తున్నామని, కోరంగి అభయారణ్యం పరిధిలో ఎక్సైజ్ అధికారులు కూడా దృష్టిసారించాల్సి ఉందన్నారు. నాటు సారాకు వినియోగించే ముడిసరుకు పట్టుకున్న ప్రాంతంలో ఓ కాలువ ఒడ్డున బట్టీలు కూడా కనుగొన్నామని, అక్కడ ఓ మోటారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లభ్యం అయిన బెల్లం ఊటను ధ్వంసం చేశామని రేంజర్ వరప్రసాద్ చెప్పారు.