ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ఎన్నో మోసాలు వెలుగులోకి వస్తున్నా ఇంకా కొందరిలో అవగాహన కలగడం లేదు. వారు ఆ సైబర్ దుండగుల ఉచ్చులోనే చిక్కుకుంటున్నారు. ఈ తరహా మోసాలపై మీడియాలో ఎంతో తరచుగా కథనాలు వస్తున్నా జాగ్రత్త పడడంలో కొందరు ఇంకా విఫలం అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై ప్రేమ, పెళ్లి అంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి ఏకంగా రూ.కోటి కాజేసిన కిలాడి దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే..
సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు గుంటూరు జిల్లాకు చెందిన యర్రగుడ్ల దాసు, జ్యోతి.. కల్యాణిశ్రీ పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. ఏడాదిన్నరపాటు ప్రేమాయణం నడిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. చేబదులు.. ఇతర ఖర్చులంటూ దశల వారీగా రూ.కోటి కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపిన పోలీసులు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి వెళ్లి నిందితులను పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచి, జైలుకు తీసుకెళ్లారు.
హైదరాబాద్‌లోని ఓ మల్టినేషనల్ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు 40 ఏళ్లు ఉన్నాయి. అయినా వివాహం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంవత్సరంన్నర క్రితం జ్యోతి అనే మహిళ కల్యాణిశ్రీ పేరుతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయింది. తాను విజయవాడలో ఉంటున్నానని, సంప్రదాయ కుటుంబమని చెప్పింది. తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పింది. తనకు ఫోన్ చేయవద్దని, విజయవాడకు రావొద్దని షరతు విధించింది. కేవలం చాటింగ్ ద్వారానే మాట్లాడదామని అనుకున్నారు. ఈ నిందితురాలు జ్యోతికి ఎర్రగుడ్ల దాసు సహకరించేవాడు. జ్యోతిని నిజంగానే కల్యాణిశ్రీ అనుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. తాను ప్రేమిస్తున్నానని, ఇష్టమైతే పెళ్లి చేసుకుందామని ఆఫర్ చేశాడు.
ఒక్కసారి కలుద్దాం అంటూ ప్రతిపాదించగా.. పెళ్లి సంబంధం మరో వ్యక్తితో మాట్లాడాలని కోరింది. మరో ఒక ఫోన్ నంబర్ ఇచ్చింది. అతనిలాగా ఎర్రగుడ్ల దాసు నటించాడు. ఖర్చులు, ఇతర అవసరాల పేరుతో జూన్ 2020 నుంచి అక్టోబరు 2021 వరకు రూ.కోటి కాజేశాడు. పెళ్లి పేరుతో మోసం చేసిన దాసు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి. గతంలో ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేసిన అతను జూదానికి అలవాటు పడ్డాడు. ఆన్‌లైన్ రమ్మీ ఆడుతూ విధులు మర్చిపోవడంతో సదరు సంస్థ ఉద్యోగంలోంచి తొలగించింది. దీంతో అప్పటి నుంచి బెట్టింగ్‌లకు బానిసై మోసానికి పాల్పడుతూ వస్తున్నాడని పోలీసులు వివరించారు.
Also Read: Tirupati: మానవత్వం చాటుకున్న ఎంపీ గురుమూర్తి... సీపీఐ నారాయణ కాలికి కట్టుకట్టిన వైసీపీ ఎంపీ
Also Read: ప్రజలంతా కష్టాల్లో ఉంటే.. సీఎం జగన్ విందులు, వినోదాల్లో ఉన్నాడు
Also Read: రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !