కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా రోజు వారి అవసరం ఉండే నిత్యావసర కాయగూర టమోటా ధర విచ్చలవిడిగా పెరుగుతోంది. కొద్ది నెలలుగా ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి టమోటా ధర చేరింది. ఏ రకం కూరగాయ కొనాలన్నా దాదాపు రూ.60కి పైగా ధర పలుకుతుండగా.. టమోటా మాత్రం కొన్ని చోట్ల రూ.140 దాటేసింది. దీంతో పెట్రోలు ధరలను సైతం టమోటా దాటేసిందంటూ మీమ్స్ వస్తున్నాయి. గతంలో ఉల్లి ధరల పెరుగుదల సమయంలో వచ్చిన ఫన్నీ మీమ్స్ తరహాలో టమోటాల విషయంలోనూ జరుగుతోంది.
సాధారణంగా శీతకాలంలో కిలో టమోటాల ధర రూ.20 నుంచి రూ.30 మధ్యలో ఉంటుంది. తాజాగా తెలుగు రాష్ట్రాలతోపాటు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ టమోటా ధర రూ.100 దాటి ఇంకా ఎగబాకుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో టమాటా సుమారు రూ.120 వరకూ ఉంది. టమోటా పంట అధికంగా సాగయ్యే ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో అయితే కిలో టమాటా ఏకంగా రూ.140 దాటింది.
కారణం ఏంటంటే..
అక్టోబరు చివరి వారం, నవంబర్ నెల మొదటి వారం వరకూ టమోట కిలో ధర దాదాపు రూ.20 మాత్రమే ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా టమోటా ధర కిలో రూ.20 నుంచి రూ.40 మధ్యనే ఉంది. అయితే కేవలం 20 రోజుల వ్యవధిలోనే టమోటా రేటు రూ.120 దాటేసింది. దీనికి ప్రధాన కారణం.. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా టమోటాలు పండే రాయలసీమలో అధిక వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఏటా లక్షా 43 వేల ఎకరాల్లో 2.27 లక్షల టన్నుల టమోటా సాగవుతుంది. అందులోనూ ఎక్కువ భాగం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే పండుతుంది. తాజాగా అతి భారీ వర్షాల కారణంగా టమోటా పంట తీవ్రంగా దెబ్బతినడం, రవాణా చేయడానికి వీలు లేకుండా రోడ్లు, బ్రిడ్జిలు ఎక్కడిక్కడ తెగిపోవడంతో టమోటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని చెబుతున్నారు.
Also Read: Weather Updates: ఏపీకి మరోసారి భారీ వర్ష ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వానలకు అవకాశం..
ఎప్పుడు దిగి రావచ్చు?
అయితే, ప్రస్తుతం పెరిగిన ఈ టమోటా ధరలు మరో నెల రోజుల వరకు దిగి రావడం కష్టమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు వస్తున్న టమోటా మహారాష్ట్రలోని సోలాపూర్, కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్, ఛత్తీస్‌గడ్‌లోని పలు ప్రాంతాల నుంచి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణ ఘటన... స్నేహితుడికి మద్యం తాగించి అతడి భార్యపై అత్యాచారం, ఆపై హత్య...
Also Read: KCR In Delhi: ఒడువని ధాన్యం సేకరణ ముచ్చట.. ఢిల్లీలోనే సీఎం కేసీఆర్, మంత్రులుz