First Case Under New Criminal Law: కొత్త క్రిమినల్ చట్టాలు అలా అమల్లోకి వచ్చాయో లేదో అప్పుడే తొలి కేసు నమోదైంది. భారతీయ న్యాయ సన్హిత కింద ఈ కేసు రిజిస్టర్ అయింది. ఢిల్లీలో ఓ వీధి వ్యాపారి రోడ్డుని బ్లాక్ చేసినందుకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సన్హితలోని Section 285 కింద FIR నమోదు చేశారు. ఈ నిబంధన ప్రకారం ఎవరైనా ఎలాంటి హక్కు లేకుండానే ఓ ప్రాపర్టీపైన అధికారం చెలాయించడం, ఆక్రమించడం, ప్రమాదానికి కారణమవడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం లాంటివి చేసిన వాళ్లకు రూ.5 వేల జరిమానా విధిస్తారు. ఈ మేరకు ఆ వ్యాపారిపై కేసు నమోదైంది. ప్యాట్రోలింగ్‌ డ్యూటీలో ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించారు. రోడ్డుపైనే వాటర్ బాటిల్స్, గుట్కా విక్రయిస్తున్నాడు. ఆ స్టాల్ రోడ్డుపైన పెట్టుకోవడం వల్ల ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. అంతకు ముందు చాలా సార్లు పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని మందలించారు. అయినా ఆ వ్యాపారి పట్టించుకోలేదు. అందుకే FIR నమోదు చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద స్టాల్ పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 


"వీధి వ్యాపారి రోడ్డుపైనే వాటర్ బాటిల్స్, బీడీలు, సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తున్నాడు. ఈ కారణంగా వచ్చీ పోయే వాళ్లకు తీవ్ర అంతరాయం కలిగింది. గతంలో చాలా సార్లు చెప్పి చూశాం. కానీ వినలేదు. అందుకే FIR నమోదు చేశాం"


- పోలీసులు