Airport Bomb Hoax :  తాను ఎక్కాల్సిన విమానం లేటవ్వాలని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకు లేటయింది. ఆయన ఎయిర్ పోర్టుకు వెళ్లే సరికి చెక్ ఇన్ సమయం ముగిసింది. దీంతో టిక్కెట్ ఉన్నా ప్రయాణించే అవకాశం లేకపోయింది. తాను ఎక్కలేని విమానం ఇంకెవరూ ఎక్కకూడదని ఆయన అనుకున్నారు. అంతే.. వెంటనే...ఓ ఆలోచన చేశారు. అది తనకు మేలు చేస్తుందని.. ఆలస్యం అయినా  విమానాన్ని ఎక్కేందుకు పంపిస్తారని అనుకున్నారు. కానీ ఆయన చేసిన పని జైల్లో కూర్చోబెట్టాలా చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోనే జరిగింది. 


హైదరాబాద్ నుంచి చెన్నైకు బయలు దేరే విమానం టేకాఫ్ తీసుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ బెదిరంపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు పెట్టామనిఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలను నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదు. అయినప్పటికీ.. ఇది ప్రయాణికుల భద్రతతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి.. క్షణ్ణంగా సోదాలు నిర్వహించి అన్ని ఓకే అన్న  తర్వాత ప్రయాణాలకు అనుమతించారు. 


తర్వాత  పోలీసులు  బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎవరా అని ఆరా తీశారు. సెల్ ఫోన్ టవర్ ఆధారంగా సెర్చ్ చేస్తే.. చివరికిఆ ఫోన్ నెంబర్ కూడా.. ఎయిర్ పోర్టులోనే ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే ఎయిర్ పోర్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అలా ఫేక్ కాల్ చేశాడో తెలుసుకుని.. వారి మరింత ఆగ్రహానికి గురై  ఉంటారు. ఎందుకంటే... ఆ పెద్ద మనిషిని.. లేటు రావడమే కాకుండా.. తనను అనుమతించలేదని..  ఆ విమానాన్ని ఆలస్యం చేయాలని ఇలా ఫోన్ కాల్ చేశాడు. అతని పెరు ఆజ్మీరా భద్రయ్యగా పోలీసులు గుర్తించారు.  


చెన్నైలో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న అజ్మీరా భద్రయ్య ఈ తుంటరని చేశాడు.  విమానాశ్రయానికి ఆయన లేట్ గా రావడంతో ఆయనను ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో, ఆయన ఈ బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విమానం ఎక్కి చెన్నై వెళ్లాల్సిన వ్యక్తి చివరికి..  జైల్లో కూర్చున్నాడు.                                 


విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లకు తరచూ  బాంబు ఉందంటూ.. ఫోన్ కాల్స్ వస్తూంటాయి. అయితే ఏ ఫోన్ కాల్ న తేలికగా తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి.. పోలీసులు సీరియస్‌గా సోదాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే దీని వల్ల అటు ప్రయాణికుల సమయం.. ఇటు పోలీసుల సమయం వృధా అవుతోంది. ఇలాంటి ఫేక్ కాల్స్ ను సీరియస్‌గా పరిణిస్తామని ఎన్ని సార్లు పోలీసులు ప్రకటించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. బాగా చదువుకున్న వారు కూడా ఇలా ఆకతాయి పనులు చేస్తూనే ఉన్నారు.